Polavaram Rehabilitation Victim Farmer Suicide Attempt : పోలవరం నిర్మాణానికి భూములు, ఇళ్లు కోల్పోయి కట్టుబట్టలతో బయటకు వచ్చిన నిర్వాసితులు ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో పడరాని పాట్లు పడుతున్నారు. పరిహారంతో పాటు పునరావాసం కోసం కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేక అనేక గ్రామాల ప్రజలు విసుగు చెందారు. ఇలానే సాగితే కష్టమనుకున్న ముంపు గ్రామంలోని ఓ ఊరి పెద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఇప్పటికైనా తనతో పాటు నిర్వాసితులందరకీ న్యాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వం, అధికారులకి రావాలనే ప్రాణత్యాగానికి సిద్ధపడ్డానని ఆవేదనగా తెలిపారు.
అల్లూరి జిల్లా దేవీపట్నంలోని పోలవరం నిర్వాసితుల్లో నూటికి 80 మంది తిండి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆ గ్రామానికే చెందిన నిర్వాసితుడు, గ్రామ పెద్ద సీతారామయ్య అన్నారు. తమ ఊరితో పాటు ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన అనేక మంది నిర్వాసితుల పరిస్థితి ఇలానే ఉందన్నారు. న్యాయం చేయాలని కార్యాలయాల వద్ద ధర్నాలు, ఆందోళనలు చేసినా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోలేదని అక్కడ ఇక్కడంటూ తిప్పుతున్నారే తప్ప సమస్య పరిష్కరించలేదని వాపోయారు. రాజమహేంద్రవరంలోని కుమారుడు నాగేశ్వరరావు వద్ద ఉన్న తాను శుక్రవారం ఉదయం ధవళేశ్వరంలోని పోలవరం కార్యాలయానికి వెళ్లానని తెలిపారు. అక్కడ ఉన్నతాధికారులు లేరని, వినతిపత్రం తీసుకుని వారికి పంపిస్తామంటూ సిబ్బంది చెప్పారని సీతారామయ్య అన్నారు. గతంలో పదుల సార్లు తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పటికైనా ప్రజలకు న్యాయం చేయాలని కోరానని చెప్పారు. దీనావస్థలో ఉన్న నిర్వాసితుల బాధలు చూడలేక చివరి ప్రయత్నంగా తాను ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకున్నానని సీతారామయ్య వివరించారు.
దేవీపట్నం మండలంలోని పోలవరం నిర్వాసితుల కోసం తన తండ్రి ఎప్పుడూ అలోచిస్తూ ఉంటారని సీతారామయ్య కుమారుడు నారాయణస్వామి తెలిపారు. తమ ప్రాంత ప్రజలకు ఎలాగైనా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే తన తండ్రి ఈ పని చేశారని వాపోయారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీతారామయ్యను జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పరామర్శించారు. ఒక నిర్వాసితుడు ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసుకుంటే కనీస బాధ్యతగా అధికారులు ఆసుపత్రికి వచ్చి పరామర్శించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.
సీతారామయ్యను చూసేందుకు గ్రామస్థులు ఆస్పత్రికి వచ్చారు. అక్కడ ఇద్దరు కానిస్టేబుళ్లను అధికారులు ఉంచారు. సీతారామయ్య ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలు ధవళేశ్వరంలోని పోలవరం కార్యాలయానికి వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.