Arrangements for Prime Minister AP visit: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని, కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. అందులో భాగంగా ప్రధాని ఏపీ పర్యటనపై సీఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12న చేయనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. ఆయన పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 12 తేదీ ఉదయం 8.20 గం.లకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉ.10.40.గం.లకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారని తెలిపారు. ఉదయం10.55 కు అక్కడకు సమీపంలోని ఐటి పార్కు ప్రాంగణానికి చేరుకుని 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గోంటారని వెల్లడించారు. అనంతరం ప్రధాని 12.40 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి భువనేశ్వర్ వెళతారని చెప్పారు.
ట్రాఫీక్ ఆంక్షలు: చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు వీవీఐపీలు, ముఖ్య నాయకులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశము ఉన్నందున పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. విజయవాడ నుంచి గన్నవరం వైపుకు వెళ్ళు పలు వాహనముల రాకపోకలకు అసౌకర్యము కలుగకుండా ఉండేందుకు ట్రాఫిక్ మళ్లింపులు చర్యలు చేపట్టినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు పేర్కొన్నారు.