PM Modi Railway Projects Launch Telangana 2024 : వందే భారత్ వంటి రైళ్ల గురించి గతంలో ఏ ప్రభుత్వాలు ఆలోచించలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పదేళ్ల నుంచి రైల్వే రంగంలో వస్తున్న మార్పులు ప్రజలంతా చూస్తున్నారని తెలిపారు. ఇవాళ తెలంగాణలోని పలు రైల్వే అభివృద్ధి పనులకు మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా 500కుపైగా అమృత్ భారత్ స్టేషన్ల (Amrit Bharat Stations)ను ప్రారంభించారు. 1500 రైల్ ఫ్లై ఓవర్, అండర్ పాస్‌లకు భూమి పూజ చేయడంతో పాటు జాతికి అంకితం చేశారు.
హైదరాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొన్న ప్రధాని రాష్ట్రంలోని వివిధ రైల్వే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీ లక్ష్మణ్‌తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
PM Modi Launches Telangana Railway Projects : ఇందులో భాగంగా రాష్ట్రంలో రూ.230 కోట్లకు పైగా నిధులతో 15 అమృత్ భారత్ స్టేషన్లు, రూ.169 కోట్లకు పైగా నిధులతో 17 రైల్వే ఫ్లె ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించనున్నారు. రూ.221.18 కోట్లతో పూర్తి చేసిన మరో 32 రైల్వే ఫ్లై ఓవర్, రైల్ అండర్ పాస్‌లను మోదీ జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించి ప్రాజెక్టుల మొత్తం విలువ దాదాపు రూ.621 కోట్లు కాగా, రాష్ట్రంలో మొత్తం 40 అమృత్ భారత్ స్టేషన్లు పునరాభివృద్ధికి రూ.224 కేట్లు ఖర్చు చేస్తున్నారు. గత ఆగస్టులో రూ.894 కోట్ల అంచనా వ్యయంతో 21 అమృత్ భారత్ స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని మోదీ భూమి పూజ చేసిన విషయం తెలిసిందే.
మోదీ మరో డేరింగ్ స్టంట్- సముద్ర గర్భంలోకి వెళ్లి శ్రీ కృష్ణుడికి పూజలు
"రైల్వే రంగంలో వస్తున్న మార్పులు మీ కళ్లతో మీరు చూస్తున్నారు. వందే భారత్ వంటి రైళ్ల గురించి గతంలో ఏ ప్రభుత్వాలు ఆలోచించలేదు. గతంలో రైల్వేలు రాజకీయాలకు బాధిత వ్యవస్థగా మారాయి. పదేళ్ల క్రితం వరకు రైల్వే స్టేషన్లు, బోగీల్లో అపరిశుభ్రంగా ఉండేవి. మధ్యతరగతి వాళ్లు రైల్వే స్టేషన్‌కు వెళ్లే పరిస్థితి వచ్చింది. పేదతరగతి వారు కూడా రైళ్లలో ప్రయాణించే పరిస్థితి వచ్చింది. ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతోంది. పదేళ్ల నుంచి నూతన రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి." - నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
మోదీ అంటే అభివృద్ధికి మారు పేరని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి , మౌలిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఖర్చు చేస్తోందని తెలిపారు. బడ్జెట్‌లో రైల్వే కోసం తెలంగాణ రాష్ట్రానికి రూ.4,400కోట్లు కేటాయించారని వెల్లడించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka On Kazipet Railway Coach Factory) మాట్లాడుతూ రైల్వే అతిపెద్ద రవాణా వ్యవస్థ అని పేర్కొన్నారు. తక్కువ ధరతో ప్రయాణించే ఈ వ్యవస్థను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం తోడ్పాటునందించాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలో ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం కానుకగా ఇస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఎంపీ లక్ష్మణ్ ఈ విషయంలో చొరవ చూపించాలని కోరుతున్నట్లు చెప్పారు.
దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ప్రారంభం- ద్వారక గుడికి వెళ్లడం ఇక చాలా ఈజీ!
'ప్రపంచ దేశాలన్నీ మోదీ వైపు చూస్తున్నాయి - రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతాం'