Plastic Water Bottles Side Effects : మనిషి అవసరాల్లో భాగమైన వస్తువు ప్లాస్టిక్ బాటిల్. ఇంట్లో నీళ్లు నిల్వ చేసుకోవడానికైనా, పని మీద బయటకు వెళ్లినపుడైనా, కార్యాలయమైనా ప్లాస్టిక్ సీసా తప్పనిసరి. అయితే ఈ బాటిళ్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. ప్లాస్టిక్ బాటిళ్లలోని నీటిలో నానో ప్లాస్టిక్‌లు ఉంటాయన్న వాదన చాలా కాలంగా వినిపిస్తుండగా వాటిని గుర్తించే సాంకేతికతను అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది.
దాని సహాయంతో అమెరికాలోని మూడు ప్రముఖ కంపెనీల ప్లాస్టిక్ సీసా నీళ్లలపై పరిశోధనలు(Researches on Water) చేసిన శాస్త్రవేత్తలు విస్తుపోయే వాస్తవాలను వెల్లడించారు. ఒక లీటరు ప్లాస్టిక్ సీసా నీటిలో సగటున 2.40లక్షల ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు కనుగొన్నారు. ఇప్పటి వరకు అంచనా వేసిన దాని కంటే ఇది వంద రెట్లు ఎక్కువ. ఇందులో పది శాతం సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు, 90శాతం అతి సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు. అయిదు మిల్లీమీటర్ల నుంచి ఒక మైక్రోమీటర్ వరకు ఉన్న రేణువులను మైక్రోప్లాస్టిక్‌లుగా పేర్కొంటారు.
Health Issues With Drinking Plastic Water Bottles : ఒక మైక్రోమీటర్ కన్నా తక్కువ మందంలో ఉన్న వాటిని నానో ప్లాస్టిక్‌లుగా వర్గీకరించారు. చాలా సూక్ష్మంగా ఉండడం వల్ల మనిషి కణాలు, రక్తం, గుండె, కిడ్నీల్లోకి ఇవి సులభంగా ప్రవేశిస్తాయి. గర్భంలో ఉన్న శిశువుల శరీరంలోకి కూడా ఇవి చేరే ముప్పు ఉంది. సాధారణంగా ప్లాస్టిక్ సీసాలను పౌడర్ రూపంలో ఉండే మైక్రో ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. వీటిలో నీటిని నిల్వ చేసినపుడు అతి సూక్ష్మ కణాలు కరిగి అందులో చేరుతాయి.
ప్లాస్టిక్ వ్యర్థాలతో టైల్స్- 500ఏళ్ల వరకు నో డ్యామేజ్- ధర కూడా తక్కువే!
ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇంకా అధిక పరిణామంలో నానో ప్లాస్టిక్‌లు(Nano Plastics) కలుస్తాయి. శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం ప్లాస్టిక్ సీసా నీటిలో ప్రధానంగా ఏడు రకాల అవశేషాలు ఉంటాయి. నీటి శుద్ధికి ఎక్కువగా ఉపయోగించే పాలీ అమైడ్, ప్లాస్టిక్ బాటిళ్ల తయారీలో ఉపయోగించే పాలీ ఇథలీన్ టెరెఫ్టలేట్, పాలీ వినైల్ క్లోరైడ్, పాలీ మిథైల్ మెథాక్రిలేట్, పాలిస్టరీన్ ప్లాస్టిక్‌లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటితో పాటు అనేక రేణువులను గుర్తించి వాటి వర్గీకరణపై దృష్టి సారించారు.
ప్లాస్టిక్ సీసాలో నీటిలో కనిపించని విషం : వీటి వల్ల క్యాన్సర్లు, కిడ్నీ, కాలేయ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. మధుమేహం, అధిక బరువు వంటివి కూడా పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిస్‌ఫినాల్ -ఎ(బీపీఏ) అనే రసాయన పదార్థం చాలా ప్రమాదకరమైనది. గతంలో ప్లాస్టిక్ సీసాల తయారీలో దీన్ని ఎక్కువగా వినియోగించేవారు. దీని వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయనే కారణంతో బీపీఏ రహిత సీసాలనే తయారు చేస్తున్నామని కంపెనీలు చెబుతున్నాయి.
బీపీఏ రహిత సీసాలనే తయారు చేస్తున్నామని కంపెనీలు చెబుతున్నా ఏడు రకాల ప్లాస్టిక్‌తో తయారు చేసిన సీసాల్లో వాటి అవశేషాలు కనిపిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మానవుల పునరుత్పత్తిపై బీపీఏ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీంతో తయారైన ప్లాస్టిక్ సీసాలోని నీటిని తాగిన మహిళలు, పురుషుల్లో హార్మోన్ల అసమతుల్యతను(Hormonal Imbalance) గుర్తించినట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి.
Plastic Water Bottles Harmful to Health : గర్భిణులు ఇలాంటి బాటిళ్ల నీరు ఎక్కువగా తాగితే పుట్టబోయే పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తుతాయని, క్యాన్సర్ బారిన పడే ప్రమాదం కూడా ఉందని అవి హెచ్చరిస్తున్నాయి. బాలికలు చిన్న వయసులోనే రజస్వల కావడానికి ప్లాస్టిక్ సీసాల వినియోగమూ ఒక కారణం అని తేలింది. ఇలా అనేక రూపాల్లో ప్లాస్టిక్ సీసాలు మనుషుల ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి.
ప్లాస్టిక్ బాటిళ్ల నీరు తాగడం వల్ల మనిషి ఆరోగ్యం చెడిపోవడం మాత్రమే కాదు, మరో రూపంలోను అవి ముప్పు కల్గిస్తున్నాయి. వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు పర్యావరణాన్ని నష్టపరుస్తున్నాయి. అధ్యయనాల ప్రకారం 2021లో ప్రపంచవ్యాప్తంగా బాటిల్ నీటి పరిశ్రమలు దాదాపు 60వేల కోట్ల ప్లాస్టిక్ సీసాలను ఉత్పత్తి చేశాయి. దీని ద్వారా 2.5కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణంలో పోగు పడ్డాయి. ఇవి భూమితో పాటు తాగునీటి వనరులు, సముద్రాలను కూడా కలుషితం చేస్తున్నాయి.
ప్లాస్టిక్ వ్యర్థాలతో సీసీరోడ్డు నిర్మాణం- కాలేజీ పరిశోధనకు పేటెంట్
ప్లాస్టిక్ రేణువులు సముద్ర జీవుల శరీరాల్లోకి చేరి వాటి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. భూమి, నదుల్లో విచ్చలవిడిగా చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు జంతువుల కణాల్లోకి(Animal Cells) చేరుతున్నాయి. వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను పునర్వినియోగం చేస్తున్నట్లు ప్రభుత్వాలు చెబుతున్నా అది ఆశించిన స్థాయిలో జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మరో వైపు ప్లాస్టిక్ బాటిళ్ల వ్యాపార గిరాకీని తట్టుకునేందుకు కంపెనీలు ఆధునిక సాంకేతికతతో భూగర్భ జలాలను యథేచ్చగా తోడేస్తున్నాయి. దీని వల్ల సమీప ప్రాంతాలకు తాగు, సాగు నీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పర్యావరణానికి పెను ముప్పుగా మారిన ప్లాస్టిక్ భూతం : ప్లాస్టిక్ బాటిళ్లు ఎంత ప్రమాదకరమో కొలంబియా విశ్వవిద్యాలయం అధ్యయనంలో ఇప్పుడు తేలినా వాటి వినియోగం తగ్గించాలని శాస్త్రవేత్తలు చాలా కాలంగానే హెచ్చరిస్తూ వస్తున్నారు. అయినా అది తగ్గడం లేదు. 2010-2020 మధ్య కాలంలో ప్లాస్టిక్ నీటి సీసాల వ్యాపారం 73శాతం వృద్ధి చెందింది. ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాపారంగా ఇదీ ఒకటిగా నిలిచింది. 2021లో ప్రపంచవ్యాప్తంగా 22లక్షల కోట్ల ప్లాస్టిక్ సీసాల వ్యాపారం జరిగింది.
2030నాటికి ఇది 41లక్షల కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉంది. ప్రపంచంలో అమెరికా, చైనా, ఇండోనేషియాలో ప్లాస్టిక్ సీసాల్లో నీటి వినియోగం అధికంగా ఉంది. భారత్‌లోనూ ఇది అంతకంతకూ పెరగడం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. 2022లో భారత్‌లో బాటిళ్లలో అమ్మే నీటి వ్యాపారం విలువ 1.8లక్షల కోట్ల రూపాయలు. 2030నాటికి ఇది 2.90లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. అంటే కట్టడి చర్యలు తీసుకున్నా అది ఇంకా విస్తరిస్తుందని అర్థం. ఈ గణాంకాలు తీవ్రంగా కలవరపెట్టే అంశమే.
Side Effects of Plastic Pollution : ప్లాస్టిక్ బాటిళ్ల ప్రమాదకర తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వాలు, పౌరులు మేలుకోవాల్సిన సమయం వచ్చింది. వీటి కట్టడి బాధ్యత కేవలం ప్రభుత్వాలది మాత్రమే కాదు, పౌరులపై కూడా ఉంది. ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగానికి ప్రజలు స్వచ్ఛందంగా దూరంగా ఉండాలి. ఇప్పుడు మార్కెట్‌లోకి స్టీలు, మట్టి బాటిళ్లు(Clay Bottles) అందుబాటులోకి వస్తున్నాయి. ప్లాస్టిక్ బాటిళ్లతో పోలిస్తే స్టీల్ బాటిల్ ధర కాస్త ఎక్కువే అయినా ఆరోగ్యంతో పోలిస్తే అది పెద్ద విషయమేమీ కాదు.
ప్లాస్టిక్ బాటిళ్లకు బదులు ప్రజలు వీటి వినియోగంపై దృష్టి సారించాలి. బాటిల్ కంటే నల్లా నీరే సురక్షితం అని ఇటీవల అధ్యయనాలు వెల్లడించాయి. స్టీల్ బిందెల్లో నీటిని నిల్వ చేసుకుని తాగవచ్చు. శుభకార్యాలు, ప్రయాణాల్లో ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగానికి ముగింపు పలకాలి. కంపెనీలు కూడా ప్లాస్టిక్ బాటిళ్లకు ప్రత్యామ్నాయాన్ని ఆలోచించాలి. ఇలా అందరూ ఈ దిశగా అడుగులు వేయాలి. ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగానికి దూరంగా ఉంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. ఇది సత్వరమే ఆరంభం కావాలి.