Phone Tapping Case Update : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ఎస్‌ఐబీ మాజీ ఓఎస్‌డీ ప్రభాకర్‌రావు, మరో నిందితుడు శ్రవణ్‌రావును అమెరికా నుంచి హైదరాబాద్‌కు రప్పించేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఆ కేసులో వీరిద్దరిని గత నెల 29న నిందితులుగా చేర్చారు. మార్చి 10నే ఫోన్ ట్యాపింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా, అప్పట్లోనే ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావుపైనా ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో వారిద్దరు వేర్వేరుగా అమెరికాకు వెళ్లిపోయారు. అయితే నలుగురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేసిన సమయంలో వారిని నిందితుల జాబితాలో చేర్చలేదు.
ఎఫ్‌ఐఆర్ నమోదైన 50 రోజుల తర్వాత ఆ ఇద్దరిని నిందితులుగా చేర్చడంతో, వీలైనంత తొందరగా వారిని అమెరికా నుంచి రప్పించే యోచనలో పోలీసులున్నట్లు తెలుస్తోంది. వారిద్దరిని విచారిస్తేనే రాజకీయ కోణం బయటపడే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినందున ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును విచారించి, వివరాలు రాబట్టేందుకు పోలీసులు వేగవంతంగా చర్యలు చేపట్టారు.
TS GOVT Give RED Notices to US Govt : అమెరికా నుంచి నిందితులను రప్పించేందుకు పోలీసులు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. తాము నమోదు చేసిన కేసులో నిందితులు విదేశాల్లో ఉన్నట్లు ముందుగా దర్యాప్తు సంస్థ ధ్రువీకరించుకోవాలి. ఆ తర్వాత సీబీఐని సంప్రదించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఒక్క సీఐడీ మినహా ఇతర దర్యాప్తు సంస్థలు నేరుగా సీబీఐని సంప్రదించే అవకాశం లేదు. అందుకే దర్యాప్తు సంస్థలు తమ కేసులో నిందితులను విచారించాల్సిన అంశాన్ని విశదీకరిస్తూ సీఐడీకి సమాచారమిస్తారు. అప్పుడు సీఐడీ ఆ వివరాలతో సీబీఐకి లేఖ రాస్తుంది. అనంతరం సీబీఐ ఫ్రాన్స్‌లోని ఇంటర్‌పోల్‌ను సంప్రదిస్తుంది.
SIB Ex OSD Prabhakar Accused in Phone Tapping Case : ఇంటర్‌పోల్ అధికారులు నిందితులను విచారించాల్సిన ఆవశ్యకత సదరు దర్యాప్తు సంస్థకు ఉందని భావిస్తే, అప్పుడు రెడ్‌కార్నర్ నోటీస్ జారీ చేస్తుంది. ఆ నోటీస్ ఇంటర్‌పోల్ పరిధిలోని 196 సభ్యదేశాలకీ వెళ్తుంది. ఆయా సభ్యదేశాల్లోని విమానాశ్రయాలన్నింటికీ నోటీస్ జారీ అవుతుంది. అప్పుడు నిందితులు తమ దేశంలో ఉంటే ఆయా దేశ దర్యాప్తు సంస్థలు వారిని సొంత దేశానికి తిరిగి పంపే అవకాశముంది. ప్రస్తుతం నిందితులు అమెరికాలో ఉన్నట్లు తేలడంతో యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఆ ఇద్దరు నిందితులను భారత్‌కు పంపించవచ్చు. ఇంటర్‌పోల్ లైజన్ ఆఫీస్ అమెరికా న్యూయార్క్‌లో ఉండటంతో ఆ ప్రక్రియ మరింత సులభమవుతుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 6792 రెడ్‌కార్నర్ నోటీస్‌లు సర్క్యులేషన్‌లో ఉన్నాయి. మన దేశంలోని కేసుల్లో 282 మందిపై ప్రస్తుతం రెడ్ నోటీస్‌లు జారీ అయ్యాయి.