Philippines minister Meets Minister Uttam Kumar : తెలంగాణ బియ్యం కావాలని ఫిలిప్పీన్స్ దేశం కోరింది. ఈ మేరకు ఆ దేశ ఆహార, వ్యవసాయశాఖ మంత్రి రోజేర్స్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఈ విషయంపై చర్చించారు. ఫిలిప్పీన్స్ ప్రతినిధులు కొద్దిరోజుల క్రితం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కమిషనర్ డి.ఎస్.చౌహాన్, ఇతర నిపుణులతో మాట్లాడి వెళ్లారు. శనివారం ఇక్కడ పౌర సరఫరాల భవన్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్, ఫిలిప్పీన్స్ మంత్రి రోజేర్స్ పాల్గొన్నారు.
3 లక్షల టన్నుల బియ్యం ఎగుమతుల అంశంపై చర్చ : ఈ సమావేశంలో తెలంగాణ నుంచి 3 లక్షల టన్నుల బియ్యం ఎగుమతుల అంశం ప్రతిపాదనపై ప్రాథమికంగా చర్చించారు. తెలంగాణ బియ్యం నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ధాన్యం రకాలు, బియ్యం నాణ్యతపై ఆయన వివరించారు. విదేశాలకు బియ్యం ఎగుమతులపై ప్రస్తుతం 10 శాతం సుంకం ఉంది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న నేపథ్యంలో బియ్యం ఎగుమతుల విషయంలో సుంకం మినహాయింపుపై రాష్ట్రప్రభుత్వం దృష్టి పెట్టింది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించారు. ఆయన త్వరలో ఫిలిప్పీన్స్‌కు వెళ్లి మరో దఫా చర్చలు జరపనున్నారు. ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చాక బియ్యం ధరపై నిర్ణయముంటుందని పౌరసరఫరాలశాఖ వర్గాల సమాచారం.