People Traveling on Railway Bridge In Mancherial District : మంచిర్యాల జిల్లా కేంద్రానికి సుమారు 14 కిలో మీటర్ల దూరంలో ఊరుమందమర్రి గ్రామం ఉంది. గ్రామ సమీపాన పెద్ద వాగుపై వంతెన నిర్మించకపోవడంతో వాగుకు అవతల ఉన్న ఊరుమందమర్రితో పాటు కాశీపేట మండలంలోని మామిడిగూడ, పెద్ద ధర్మారం, చిన్న ధర్మారం, అశోక్‌నగర్, గోండుగూడెం, కొమ్ముగూడెం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వర్షాకాలం మినహా రోజుల్లో ఇక్కడ నిర్మించే తాత్కాలిక వంతెనను రాకపోకలకు ఉపయోగిస్తున్నారు. కానీ వర్షాకాలంలో కురిసే వర్షాలకు కల్యాణ ఖని ఉపరితలగనిలో నీరు వదిలేసినప్పుడు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఆ సమయంలో మాత్రం ఊరుమందమర్రి, మంచిర్యాలకు రావాలంటే రైలు పట్టాల మీదుగా, రైల్వే వంతెన దాటుకుని ప్రయాణిస్తున్నారు.
సమయం, దూరం కలిసివస్తాయని : కాశీపేట మండలంలోని గ్రామాల ప్రజలు రహదారి ద్వారా ఊరుమందమర్రికి చేరుకోవాలంటే 15-20 కిమీ ప్రయాణించాల్సి ఉంటుంది. ఊరుమందమర్రి పెద్ద వాగుపై వంతెన నిర్మిస్తే కేవలం 2-3 కిలోమీటర్లు ప్రయాణిస్తే సరిపోతుంది. సమయం, దూరం రెండూ కలిసి వస్తాయని గ్రామస్థులు రైలు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. నిత్యం ఈ మార్గం ద్వారా వందల మంది గ్రామస్థులు, కూలీలు, రైతులు, విద్యార్థులు రేయింబవళ్లు రాకపోకలు సాగిస్తుంటారు.
మళ్లీ వానొచ్చింది తిప్పలు తెచ్చింది - ఈ వర్షాకాలం మేం ఊరు దాటేదెలా? - Jampanna Vagu Bridge Damage
"ఊరుమందమర్రి వాగుపై బ్రిడ్జి నిర్మాణం లేక విద్యార్థులు, రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి నుంచి మంచిర్యాలకు వెళ్లాలి అంటే దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్లు పడుతుంది. అందుకే ఇలా వెళ్తున్నాం. చాలాసార్లు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా, ఎలాంటి ఫలితం లేదు. రైల్వే ట్రాక్‌పై నడుస్తూ ఇప్పటికే చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. గర్భిణీలను, ఇతర పేషెంట్స్‌ను ఈ మార్గాన్నే తీసుకుపోతున్నాం. ఆలస్యమైతే ప్రాణాలు ఎక్కడపోతాయోనని ఇలానే తీసుకువెళ్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బ్రిడ్జిని కట్టాలి." - స్థానికులు
ఇప్పటి వరకు 17 మంది బలి : ఊరుమందమర్రి - దేవాపూర్ సిమెంట్ పరిశ్రమ కోసం ఊరుమందమర్రి, కాశీపేట మండలాల మీదుగా 13 కిలోమీటర్లు సింగిల్ రైల్వే ట్రాక్ నిర్మించారు. నిత్యం ఈ మార్గంలో గూడ్స్ రైలు రాకపోకలు సాగిస్తుంటాయి. వాగుపై వంతెన లేకపోవడంతో ప్రజలు నిత్యం రైలుమార్గం మీదుగా ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో రైలు వస్తే సమయంలో తప్పించుకునేందుకు సరైన అవకాశం లేకపోవడంతో ఢీకొన్న సందర్భాలూ ఉన్నాయి. వంతెన పై ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు వాగులో పడిపోయి చనిపోయిన వారూ ఉన్నారు. ఇప్పటి వరకు సుమారు 17 మంది వరకు ఇలా మరణించినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇక్కడ వంతెన నిర్మించాలని చాలా ఏళ్లుగా రెండు మండలాల ప్రజలు డిమాండ్ చేస్తున్నా స్పందన కరవైంది. ఈ రెండు మండలాలు చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఉన్నందున ఎమ్మెల్యేలు స్పందించి, సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
70 రోజుల్లో రెండోసారి కూలిన వంతెన - బిహార్‌లో అనుకుంటే పొరపాటే! - ODED BRIDGE COLLAPSED AGAIN