People Suffering Due to Damaged Roads in Srikakulam District : శ్రీకాకుళం- ఆమదాలవలస రహదారి. ఈ పేరు వింటేనే ప్రజలు హడలిపోతున్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కనీస మరమ్మతులు చేపట్టక గుంతల మయంగా మారి అత్యంత ప్రమాదకరంగా తయారైంది. దీంతో ఈ రోడ్డుపై వెళ్లాలంటనే ప్రజలు భయపడిపోతున్నారు.
గోతులతో అధ్వానంగా రహదారి : శ్రీకాకుళం-ఆమదాలవలస ప్రధాన రహదారి జిల్లాలో ఎంతో కీలకమైంది. నిత్యం వేలాది వాహనాలు తిరిగే ఈ రహదారి ప్రస్తుతం గుంతల మయంగా మారింది. ఈ రహదారి అభివృద్ధి కోసం 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కొంతమేర భూ సేకరణ చేసి పనులు ప్రారంభించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం గుత్తేదారులకు బకాయిలు చెల్లించలేదు. దీంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే రహదారి మాత్రం అడుగడుగునా గుంతల మయంగా తయారైంది.
రహదారి ప్రమాదాల నివారణపై ప్రభుత్వం ఫోకస్ - భద్రతా చర్యలకు ఆదేశం - Road Accidents Raised In AP
" గత ఐదేళ్లుగా ఈ రోడ్డు ఇలానే ఉంది. ఏ మాత్రం మార్పు చెందలేదు. రహదారిలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడి అధ్వాన్నంగా ఉంది. ఈ రహదారి వెంబడి రోజు ప్రమాదాలు జరిగి చాలా మంది చనిపోతున్నారు. గత ప్రభుత్వం ఎలానో దృష్టి పెట్టలేదు. కూటమి ప్రభుత్వమైన రోడ్లు మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నాం"_ స్థానికులు, శ్రీకాకుళం
గాలి వానలో, వాగు నీటిలో పడవ ప్రయాణం- రహదారి తెలియదు పాపం! - Pudilanka peoples problem
ఐదేళ్లుగా కనీసం మరమ్మతులు చేయని దుస్థితి : శ్రీకాకుళం నుంచి ఒడిశాను కలిపే ప్రధాన రహదారి కావడంతో భారీ వాహనాలు ఇటు నుంచి ప్రయాణిస్తుంటాయి. రహదారులపై ఏర్పడిన గుంతల్లో ఇటీవల కురిసిన వర్షాలకు నీళ్లు నిలిచిపోయాయి. వాటిలో వాహనాలు కూరుకుపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. ప్రమాదాల బారినపడి గత ఐదేళ్లలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. 108 వాహనాలు సైతం తిరగలేని పరిస్థితులు ఈ రహదారిలో ఉన్నాయని స్థానికులు, వాహనదారులు అంటున్నారు. అత్యంత దారుణంగా ఉన్న ఈ రహదారికి వీలైనంత త్వరగా మరమ్మతులు చేసి తమ ఇక్కట్లను తీర్చాలని ప్రయాణికులు కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.