Jada Koppu Kolatam Culture in Adilabad : ఎత్తైన పందిరి, రంగు రంగుల చీరలు, కాళ్లకు గజ్జలు కట్టి లయబద్ధంగా నర్తించే కళాకారులు, తబలా, డోలక్, తాలం వాయిద్యాల మధ్య కష్టసుఖాలను నెమరేసుకుంటూ శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ పాడే గాయకులు, వెరసి జడకొప్పులాట ప్రత్యేకం. దీపావళి పండగ మొదలుకొని అయిదు రోజుల పాటు మాత్రమే నిర్వహించే జడకొప్పులాట నిర్వహణలో పేద, ధనిక తేడా ఉండదు. చిన్నా, పెద్ద తారతమ్యం ఉండదు. అందరిలో పల్లె హితమే కనిపిస్తోంది. పగలంతా పొలాల్లో విరామం ఎరగకుండా పనిచేసే రైతులు, కార్మికులంతా జడకొప్పులాటతో నూతనోత్తేజం పొందుతారు. ఆదిలాబాద్ మండలంలోని జందాపూర్ జడకొప్పులాటకు ప్రసిద్ధి పొందింది.
ఎత్తైన పందిరి, దానికిపై పైభాగాన చక్రం, దానికి వేలాడేలా కొత్త చీరలు, అవి పట్టుకొని జడవేసేవాళ్లు 16 మంది కళాకారులతోపాటు, తబల, తాళం, గాయకులతోపాటు మొత్తం 30 మంది ఆడిపాడే జడకొప్పులాట ఇతివృత్తమంతా శ్రీకృష్ణుడి - రాధ ప్రేమతత్వం, యశోదాక్ష-కృష్టుడి పుత్రవాత్సల్యం చుట్టే తిరుగుతుంది. జానపదమంటేనే నవరసభరితం. మధ్యమధ్యలో ఉల్లాసాన్ని, నవ్వులను పూయించే గీతాలు కళాకారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతాయి. శ్రీకృష్ణ పరమాత్మనే జగత్ రక్షకుడనే విధంగా సాగే అయిదురోజుల జడకొప్పులాటతో గ్రామమంతా ఒక చోటకు చేరుతుంది. పగలంతా ఒళ్లు వంచి పడిన కష్టాలను మరిచిపోతోంది. కక్ష్యలు, కార్పణ్యాలకు దూరంగా సోదరభావాన్ని సంతరించుకుంటోంది.
'జడకొప్పులాట సంస్కృతి ఇప్పటిది కాదు. మొదటి నుంచి ఈ కళను కాపాడుకుంటూ వస్తున్నాం. ఇప్పటి కాలంలో ఈ కళ అంతరించి పోకుండా గ్రామంతా ఐక్యంతో ఉండి జడకొప్పులాట జరపుకుంటాం. గ్రామం ఐక్యంగా ఉండేందుకు జడకొప్పులాట సంస్కృతిని కొనసాగిస్తున్నాం. జడకొప్పులాట కళాకారులు ఉన్నారు కానీ వారికి గుర్తింపు లేదు'- జందాపూర్ గ్రామస్థులు
సంస్కృతిని కాపాడుకుంటున్న యువత : శతాబ్ధాలుగా వస్తున్న అరుదైన ఈ కళను గ్రామానికి చెందిన నేటితరం యువత, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, మహిళలు ఆటలో అందిపుచ్చుకోవటం వెనక గ్రామహితాన్ని చాటి చెబుతోంది. పరోపకారహితాన్ని పంచుతోంది. ఆధునికత కాలంలో రేవు పార్టీలు, సినిమాలు, షికార్ల సంస్కృతి వెర్రి తలలు వేస్తోంటే, పల్లెల్లో జానపదంగా పిలిచే జడకొప్పులాటలో యువత తన్మయత్వం పొందటం గ్రామాలకే కాదు, దేశానికీ హితాన్ని చేకూర్చేదే. నేటి తరం యువత దీని నుంచి స్ఫూర్తి పొందాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.
భక్తి శ్రద్ధలతో తీజ్ వేడుకలు - ఆకట్టుకుంటున్న సంప్రదాయ నృత్యాలు - Teej festival celebrations