People Requesting Boat Facility to Parnasala For Short Trip : ఒక చోటుకు వెళ్లడానికి రోడ్డు మార్గం, నది మార్గం ఉంటే ఎక్కువగా నీటిలో ప్రయాణించేలా పడవ ప్రయాణాన్ని ఇష్టపడుతుంటారు. పైగా పడవలో వెళ్తే సమయం ఆదా అవుతుందంటే ఎవరు కాదంటారు చెప్పండి. అందరూ పడవలోనే వెళ్లడానికి ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలోనే పర్ణశాలకు వెళ్లేందుకు భక్తులు, ప్రజలు పడవ ప్రయాణాన్ని కోరుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో దుమ్ముగూడెం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పర్ణశాలకు పడవ ప్రయాణం చాలా సులువు. రోడ్డు మార్గం కంటే మణుగూరు నుంచి గోదావరి నదిపై పడవపై వెళ్తే చాలా దగ్గర. ఇప్పటి చాలామంది మణుగూరులోని రాయిగూడెం నుంచి పర్ణశాలకు పడవలపై వెళ్తున్నారు.
15 నిమిషాల్లో పర్ణశాలకు : ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ గోదావరి నదిపై పడవ ప్రయాణం చేస్తూ పర్ణశాలకు వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంటుందని భక్తులు అంటున్నారు. పర్ణశాలకు వెళ్లేందుకు మణుగూరు గోదావరి నది వద్ద పడవ ప్రయాణం అవకాశాలు కల్పించాలంటూ స్థానికుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. పడవ ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తే పర్యాటకుల సంఖ్య పెరగటంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా లభిస్తుంది. మణుగూరులోని రాయిగూడెం నుంచి పర్ణశాలకు పడవై కేవలం 15 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. అదే రోడ్డు మార్గం ద్వారా అయితే దాదాపు గంటన్నర సమయం పడుతుంది.
'మణుగూరు నుంచి పర్ణశాలకు వెళ్లేలా పడవ ప్రయాణంపై పరిశీలిస్తాం. పడవ ప్రయాణం అయితే ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఈ ప్రాంతం పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతుంది'- పాయం వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే
గోదావరి సౌందర్యాన్ని తిలకిస్తూ పర్ణశాలకు : పడవ ప్రయాణంతో గోదావరి సౌందర్యాన్ని తిలకిస్తూ పర్ణశాలకు చేరుకోవచ్చు. భక్తులు, సందర్శకులకు సైతం కొత్త అనుభూతిని ఇస్తుంది. గతంలో రాయిగూడెం నుంచి పర్ణశాల వరకు వంతెనను నిర్మించాలన్న ప్రతిపాదన ఉన్నా అది ముందడుగు పడలేదు. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద కొత్తగా నిర్మించే సీతమ్మసాగర్ ప్రాజెక్ట్‌పై వంతెన నిర్మాణం కొనసాగుతోంది. ఆ వంతెన ద్వారా కూడా పర్ణశాలకు చేరుకోవచ్చు. కానీ ప్రాజెక్టు నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో పర్ణశాలకు రోడ్డు మార్గం కంటే పడవ ప్రయాణంపై చేరుకునే అంశాలను పరిశీలిస్తే బాగుంటుందని ప్రజలు అంటున్నారు.