Pension Distribution Issue in AP : వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల జీవితాలతో ప్రభుత్వం మళ్లీ వికృతక్రీడకు సిద్ధమవుతోంది. పింఛన్ల పంపిణీలో ఏప్రిల్‌లో అమలుచేసిన ఆదేశాల్నే మే నెలలోనూ కొనసాగించే ఆలోచన చేస్తోంది. వారంలో పింఛన్ల పంపిణీ ప్రారంభించాల్సి ఉన్నా ఇంటి దగ్గరే పంపిణీపై స్పష్టత ఇవ్వడం లేదు. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘమూ జోక్యం చేసుకోవడం లేదు.
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది. 66 లక్షల మంది పింఛనుదారుల జీవితాలతో వికృతక్రీడకు సిద్ధమవుతోంది. ఏప్రిల్‌లో అమలుచేసిన ఆదేశాల్నే మే నెలలోనూ కొనసాగించే యోచన చేస్తోంది. సీఎం ముఖ్య కార్యదర్శి ధనుంజయరెడ్డి, సీఎస్ జవహర్‌రెడ్డి, సెర్ప్ సీఈఓ మురళీధర్‌రెడ్డి తదితరులంతా వైసీపీ కుటిల రాజకీయానికి వంతపాడుతున్నారు. వృద్ధులు నానాకష్టాలు పడుతున్నా ఏప్రిల్‌లో 30 మందికి పైగా మరణించినా వీరి మనసు కరగడం లేదు. వారంలో మే నెల పింఛన్ల పంపిణీ ప్రారంభించాల్సి ఉన్నా ఇంటి దగ్గరే పంపిణీపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఏప్రిల్‌లో పింఛన్ల పంపిణీ సందర్భంగా వృద్ధుల్ని మండుటెండల్లో సచివాలయాలకు రప్పించి నరకయాతన పెట్టారు. ఇప్పుడూ కూడా అధికార ప్రభుత్వం తమ స్వార్థం రాజకీయలతో వృద్ధుల జీవితాలతో ఆటలాడుతూ మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారు.
పాలనలో ప్రతి చిన్న విషయంలో జోక్యం చేసుకునే సీఎం ముఖ్య కార్యదర్శి ధనుంజయరెడ్డి పింఛన్ల పంపిణీ విషయంలో ఇప్పుడు ఏం చేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సచివాలయాలకు నడవలేక రాష్ట్రంలో లక్షలమంది వృద్ధులు నరకయాతన పడుతున్నా నిర్ణయాల్ని ఎందుకు సమీక్షించడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఏప్రిల్‌లో పింఛన్ల కోసం తిరిగి వృద్ధులు మరణించినా మళ్లీ మే నెలలోనూ వాటినే కొనసాగించి తెలుగుదేశంపైకి నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. ఆయనకు ఇంకా వైసీపీ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపిస్తున్నాయి. తమ నిర్లక్ష్యం వల్ల ఏప్రిల్‌లో వృద్ధులు మరణించినా సీఎస్‌లోనూ మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యతను ఆయన ఎందుకు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పింఛనుదారుల ఇబ్బందులకు కారణమైన సీఎస్‌ను పదవి నుంచి తప్పించాలని డిమాండు చేస్తూ ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేసినా ఆయన తన వైఖరిని ఎందుకు మార్చుకోవడం లేదు.
అసలు సజావుగా సాగాల్సిన పింఛన్ల పంపిణీలో ఇన్ని సమస్యలకు కారణం మురళీధర్‌రెడ్డి నిర్ణయాలే. ప్రతిపక్షాలు, వివిధ ప్రజాసంఘాలూ ఆయనవైపే వేలెత్తి చూపిస్తున్నాయి. వృద్ధుల్ని సచివాలయాలకు రప్పించాలనే ఆలోచన చేసిందీ సీఎం ముఖ్య కార్యదర్శి ధనుంజయరెడ్డి, మురళీధరరెడ్డిలే. అదే 30 మందికి పైగా వృద్ధుల మరణాలకు దారితీసింది. కనీసం మే నెలలో అయినా పింఛన్లలను ఇళ్ల వద్దే పంపిణీ చేస్తే తమపై పడిన మచ్చను కొంతైనా తుడిచేసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇప్పటికీ వైసీపీ సేవే ముఖ్యం అనుకుంటే మరింత మంది వృద్ధుల ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టిన పాపం ఆయనదే అవుతుంది.
ముదిరిన ఎండలు, పెరిగిన వడగాలుల తీవ్రత నేపథ్యంలో కిలోమీటర్లు నడిస్తే వృద్ధుల ప్రాణాలకే ప్రమాదమని సీఈఓ మీనాకు చెప్పాల్సిన పనిలేదు. ఆ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించి ఎందుకు జోక్యం కోరడం లేదనేది ప్రశ్న. ఏప్రిల్‌లో పింఛను కష్టాలు, మరణాలు ఆయనకు తెలుసు. వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ వద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. దీంతో వచ్చే సమస్యలను సరిదిద్దాల్సిన బాధ్యత వారిదేనని తెలిసిన, తనకేమీ సంబంధం లేదని ఎలా తప్పించుకుంటారు. వృద్ధుల్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్న నేతల తీరును సీఈసీ దృష్టికి తీసుకెళ్లారా? రాష్ట్రంలో వాలంటీరు వ్యవస్థను రద్దుచేశారంటూ ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి ఎన్నికల సంఘం ఆదేశాలను వక్రీకరిస్తున్నా దానిపైనా ఎందుకు నోరు మెదపడం లేదనేది ప్రశ్నార్థకం.
ఇంటి దగ్గర పింఛన్ల పంపిణీని టీడీపీ అడ్డుకుంటోందని, వైసీపీకి ఓటేయకపోతే ఇంటి దగ్గరకు పింఛన్లు అందవని తాము పదేపదే చెబుతున్న అబద్ధాలు నిజమే అని నమ్మించాలంటే మే నెలలోనూ సచివాలయాలకు నడిపించడం, పంపిణీలో జాప్యం చేయడమే మార్గంగా వైసీపీ భావిస్తోంది. మే నెలలో నాలుగైదు రోజుల పాటు వృద్ధుల్ని ఇబ్బందులు పెడితే తప్పంతా టీడీపీ మీదకు నెట్టేయొచ్చని, ఓట్లు దండుకోవచ్చనేది ఆ పార్టీ వ్యూహం. పింఛన్ల కోసం వృద్ధుల్ని మంచాలపై తరలిస్తుంటే సీఎం జగన్ మాత్రం శవ రాజకీయాలు చేస్తున్నారని విపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబే తన మనిషి నిమ్మగడ్డ రమేశ్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేయించి వాలంటీరు వ్యవస్థను రద్దుచేయించారని, ఇంటి దగ్గర పింఛను ఇవ్వకుండా అడ్డుకున్నారని ప్రచారం చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు తప్ప అత్యవసర పనులేవీ లేవు. నాలుగురోజుల పాటు ఉద్యోగులందరినీ వినియోగించుకోవచ్చు. రాష్ట్రంలో 66 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శులు, ఇతర పంచాయతీ సిబ్బంది కలిపితే లక్షా 30వేల మందికి పైనే ఉంటారు. సగటున ఒక్కొక్కరు 40 నుంచి 50 మందికి ఇవ్వాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సాకు చెబుతున్నట్లు ఎండాకాలంలో వ్యవసాయ అనుబంధ సహాయకులకు అంత పని ఒత్తిడేమీ ఉండదు. అత్యవసర సర్వీసుల్లోని సిబ్బందిని పక్కన పెట్టినా ఇంటింటి పంపిణీకి అవసరమైన ఉద్యోగులు ఉన్నా ప్రభుత్వం కావాలనే వృద్ధుల్ని ఇబ్బందులకు గురిచేస్తోంది.
మే నెలలో పింఛను పంపిణీకి సొమ్ము అందుబాటులో ఉంటుందా లేదా? అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. వివిధ పథకాలకు సంబంధించి సీఎం జగన్ ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే రూ. 8,200 కోట్లుకు బటన్ నొక్కినా ఇప్పటికీ ఖాతాల్లో జమకాలేదు. వీటికోసం పింఛను చెల్లింపులు నిలిపేసే అవకాశం ఉందని, ఆ నెపాన్నీ తమపై నెట్టేసి టీడీపీ వల్లే పింఛను అందట్లేదని ప్రచారం చేస్తారని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.