Delay in Railway Over Bridge Construction in Peddapalli District : పెద్దపల్లి జిల్లా కూనారంలో ఎన్నో ఏళ్లుగా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలనే డిమాండ్ ఉంది. అందుకనుగుణంగా ఆరేళ్ల కిందట ఈ ఆర్వోబీ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదలలో తీవ్రజాప్యం జరిగింది. ఎట్టకేలకు గతేడాది రూ.119 కోట్ల 50 లక్షల రూపాయలతో ఈ ఆర్వోబీ పనులు మొదలయ్యాయి.
కొన్నాళ్లు వేగంగా సాగిన పనులు ఆ తర్వాత నత్తతో పోటీ పడుతున్నాయి. పెద్దపల్లి వైపు నాలుగు నెలల వ్యవధిలోనే పిల్లర్ల నిర్మాణం పూర్తి చేసిన గుత్తేదారు కూనారం వైపు మాత్రం పనులు నెమ్మదిగా చేపడుతున్నారు. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించేవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఆర్వోబీ అందుబాటులోకి వస్తే పెద్దపల్లి నుంచి కాల్వ శ్రీరాంపూర్ మీదుగా జమ్మికుంట, వరంగల్ ప్రాంతాలకు వెళ్లేవారికి దూర భారం తగ్గుతుంది. మంథనికి ముత్తారం మీదుగా అదనపు రహదారి అందుబాటులోకి వస్తుంది.
ఇందూరు వాసులకు తొలగనున్న ఇబ్బందులు - చకచకా సాగుతున్న ఆర్వోబీ పనులు - ROB WORKS IN NIZAMABAD
కాజీపేట, బల్లార్షతో పాటు దిల్లీ మార్గంలో నిత్యం వందల రైళ్లు ఇక్కడి నుంచి పయనిస్తుంటాయి. దీంతో ప్రతి 15 నిమిషాలకు ఒకసారి రైల్వేగేటు మూయాల్సి వస్తోంది. గేటు మూసిన ప్రతిసారీ కనీసం 20 నిమిషాల వరకు తిరిగి తెరిచే పరిస్థితి ఉండదు. ఈ మార్గంలో మూడో లైను పూర్తి కావడంతో రైళ్ల ఫ్రీక్వెన్సీ వేగం పెరగడంతో పాటు, రైళ్ల సంఖ్యను కూడా పెంచారు. ఈ క్రమంలోనే లెవెల్ క్రాసింగ్ నిర్వహణ నుంచి తప్పుకునేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం గ్రామాల్లో ఆర్వోబీ లేదా ఆర్‌యూబీలను నిర్మించేందుకు ప్రతిపాదిస్తోంది.
"కూనారం, పెద్దపల్లి మధ్యలో గేట్ ఉన్నందున బ్రిడ్జి నిర్మించాలని అనుకున్నారు. ఈ గేటు వల్ల స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొందరికి రోడ్డు ప్రమాదాలు జరిగి మరణించడం జరిగింది. బ్రిడ్జి నిర్మాణం చేపట్టి సంవత్సరాలు గడుస్తున్న పనులు పూర్తి కావడం లేదు. స్థానికులు బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూస్తున్నారు." - స్థానికులు
ఇదే సమయంలో పనుల జాప్యంతో గేటు దాటి వెళ్లే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆర్‌అండ్‌బీ పరిధిలో పిల్లర్ల నిర్మాణం పూర్తయినా రైల్వే లైన్‌పై స్లాబ్ పనులు ఆలస్యమవుతున్నాయి. పెద్దపల్లిలో మాత్రం ఇంకా పిల్లర్ల పనులే జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా పరిధిలో 6 ఆర్వోబీలు, 3 అండర్ పాసులకు కేంద్రం అనుమతినిచ్చింది. పట్టణంలోని కూనారం ఆర్వోబీతో పాటు రైల్వే స్టేషన్ సమీపంలోని గౌరెడ్డిపేట మార్గంలో మరో ఆర్వోబీకి నిధులు విడుదల చేసింది. అయితే నిధులు విడుదలైనా పనుల్లో మాత్రం తాత్సారం జరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ఆర్వోబీ నిర్మాణం పూర్తి చేసి ఇబ్బందులు తొలగించాలని పెద్దపల్లి వాసులు కోరుతున్నారు.
ఆదిలాబాద్‌లో రైల్వే వంతెనల పనులకు నిధుల గ్రహణం - ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి
ROB in Devarakadra : దేవరకద్రలో తుది దశకు ఆర్వోబీ పనులు.. గంటల కొద్ది నిరీక్షణకు తెర