Pawan Kalyan About AP Deputy CM Post : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు పవన్‌కల్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేశారని ఇండియా టుడే ఛానల్ ఆదివారం వెల్లడించింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రుల ప్రమాణ స్వీకారానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండియా టుడే ఛానల్ రిపోర్టర్ పవన్ కల్యాణ్‌తో మాట్లాడారు.
రిపోర్టర్ ప్రశ్నలు, ఆయన సమాధానాలు కొంత అస్పష్టంగా వినిపించినా పవన్ ఏం మాట్లాడిందీ వినపడలేదు. ఆ ప్రశ్నల సందర్భంగా ఇండియా టుడే రిపోర్టర్ వ్యాఖ్యానిస్తూ పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ ఛానల్‌లో ఈ విషయంపై స్క్రోలింగ్ ప్రసారం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్లు జనసేన అధినేత వెల్లడించారని అందులో పేర్కొన్నారు.
సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం : మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, ఎన్డీయే కూటమి ముఖ్యనేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో స్థానం పొందేది ఎవరనేది, ఎవరికి ఏ పదవి అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణస్వీకార కార్యక్రమం ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. దీంతో సభావేదిక నిర్మాణం కోసం ఇప్పటికే 12 లారీలలో సామగ్రిని తరలించారు.
గత మూడ్రోజుల క్రితం కూడా టీడీపీ ప్రధాన కార్యదర్శ నారా లోకేశ్ కేబినెట్‌లోకి చేరుతారా లేదా అని ఉత్కంఠ రేపింది. మంత్రివర్గంలో చేరడం కన్నా పార్టీ పరంగా బాధ్యతలు తీసుకుంటానని ఇంతకముందే లోకేశ్ చెప్పిన విషయం తెలిసిందే. కానీ చంద్రబాబు నిర్ణయం మేరకు నారా లోకేశ్‌కు ఏపీ కేబినేట్లో ప్రాధాన్యమున్న మంత్రిత్వ శాఖల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఉపముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎవరికి ఏ పదవి దక్కుతుందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే.