AP Deputy CM Pawan Kalyan About Panchayat Funds : 14, 15 ఆర్ధిక సంఘం నిధులు కింద 2019-2024 వరకూ గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులు తెలియజేస్తారా అనే ఏపీ అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. రెండు ఆర్ధిక సంఘాలకు కలిపి రూ.8,283.92 కోట్లు విడుదలకాగా, ఏపీ ప్రభుత్వం మాత్రం రూ.7,587.64 కోట్లు విడుదల చేసిందని తెలిపారు.
ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.696.28 కోట్లు పంచాయతీలకు ఇవ్వాల్సి ఉందని అన్నారు. నిధులు నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగాలేదని, వారికి సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో 21 వేల మంది పనులకు రావడం లేదని, దీంతో ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందులు వచ్చాయని అన్నారు.
గత ప్రభుత్వం మిస్ మేనేజ్మెంట్ కారణంగా ఎన్నో ఇబ్బందులు : తమ పనిని కొనసాగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బకాయిలు రూ.103 కోట్లు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. తాగునీరు, మోటారు మరమ్మతులు చేపట్టకపోవడం, నీరు సరిగా లేకపోవడం, గ్రామ పంచాయతీల అనుమతి లేకుండా నిధులు నేరుగా డిస్కంలకు చెల్లించడంతో ఇబ్బందులు వచ్చాయని పవన్ కల్యాణ్ అన్నారు.
గ్రామ పంచాయతీలకు గ్రాంట్లు నిలుపుదల చేయకపోవడంతో గ్రామీణ ప్రజల జీవితం ప్రభావితం అయ్యిందని తెలిపారు. గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణ 2 సంవత్సరాలు ఆలస్యం అయ్యిందని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కేంద్రం నుంచి నిధులు విడుదల కాకపోవడం వలన మరింత నష్ట పోయాయన్నారు. గత ప్రభుత్వం మిస్ మేనేజ్మెంట్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పంచాయతీల విషయంలో వచ్చాయని తెలిపారు.
ఎమ్మెల్యేల ప్రశ్నల వర్షం : అధికారులు సభకు సమర్పించిన పత్రాలలో కొన్ని తేడాలు ఉన్నాయని ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. పాపులేషన్ రేషియోలో వేరియేషన్ లేనప్పుడు గ్రాంట్ ఎందుకు తగ్గుతూ వచ్చిందో వివరణ ఇవ్వాలని కోరుతున్నామన్నారు. గ్రామ పంచాయతీలు అంటే లోకల్ సెల్ప్ గవర్నమెంట్ అని, తలసరి ఆదాయం, స్టాంపు డ్యూటీలు, సీనరేజ్ ఛార్జీలు ఎందుకు గత ప్రభుత్వం ఇవ్వలేదని అన్నారు.
రాష్రాలలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నిధులు అన్ని గ్రామ పంచాయతీలకు ఇచ్చి ఉంటే సర్పంచ్లు ఎందుకు రోడ్లపై అడుక్కునే పరిస్ధితి వచ్చిందని నిలదీశారు. గ్రామ పంచాయతీ నిధులు గ్రామాలకి ఎక్కడ విడుదల చేశారో చెప్పాలని కూన రవికుమార్ అన్నారు. పంచాయతీలకు చెందిన నిధులు ఎందుకు ఇవ్వలేదో డిప్యూటీ సీఎం చెప్పాలని ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, గొండు శంకర్ ప్రశ్నించారు. డబ్బులు ఎక్కడికి మళ్లించారో తేల్చాలని కోరారు. సర్పంచులకు గౌరవవేతనం రూ.10 వేలు ఇస్తామని సీఎం చెప్పారని గుర్తు చేశారు.
Deputy CM Pawan Kalyan Response : గత ప్రభుత్వం చేసిన అవకతవకలు ఈ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చాయని ఉపముఖ్యమంత్రి తెలిపారు. గ్రామ పంచాయతీలకు బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవని అన్నారు. దీనిపైన 4, 5 గంటలు చర్చ జరగాలని అన్నారు. ప్రత్యేకంగా వైట్ పేపర్ విడుదల చేయాలని భావిస్తున్నామన్నారు. 14వ ఆర్ధిక సంఘం ఇచ్చిన సొమ్ములో, కొంత ఆర్ధిక శాఖ డిస్కంలకు పంపేసిందన్నారు. దీనికి ఎవరి అనుమతి తీసుకోలేదని పవన్ కల్యాణ్ తెలిపారు. దీనిపై పూర్తిస్ధాయి సమాధానం రానున్న సమావేశాల్లో ఇస్తానన్నారు. గత ప్రభుత్వం అనేక తప్పులు చేసిందని, గాంధీ ఫొటో పెట్టి గ్రామ స్వరాజ్యాన్ని కాపాడలేదని మండిపడ్డారు.