Patnam Mahender Reddy Comments : తన ఫామ్ హౌజ్ ప్రభుత్వ నిబంధనల మేరకే ఉందని, ఒకవేళ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్నట్లయితే తానే దగ్గరుండి కూల్చివేయిస్తానని శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి తన పేరు తెరపైకి తెచ్చి ఆరోపణలు చేస్తున్నారని, తన ఫామ్‌హౌజ్ రూల్స్‌కు విరుద్ధంగా ఉన్నట్లు నిరూపిస్తే అక్కడికి తీసుకెళ్లి వారి సమక్షంలో కూల్చివేయిస్తానని ఆయన తెలిపారు.
నీళ్లల్లో ఉన్నట్లు కనిపిస్తుంది : ఇరవై ఏళ్ల క్రితమే అన్నీ పరిశీలించి, అధికారులతో కూడా చర్చించి ఫామ్ హౌజ్ కట్టినట్లు పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. ఇటీవల కూడా మళ్లీ సర్వే చేసి బఫర్ జోన్‌లో లేదని అధికారులు నివేదిక ఇచ్చారని, ఒకవేళ ఆ రిపోర్ట్ అసత్యమయితే ఫామ్ హౌజ్‌ను కూల్చడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దూరం నుంచి చూస్తే నీళ్లల్లో ఉన్నట్లు కనిపిస్తుంది కానీ, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో లేదన్నారు. తన ఫామ్ హౌజ్ పక్కనే సబితా ఇంద్రారెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా ఉన్నాయన్నారు.
రూల్స్ ఎవరికైనా ఒకటే : హిమాయత్ సాగర్‌లో ఆక్రమణలు తొలగించాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం మంచిదని, దానికి అందరూ సహకరించాల్సిందేనన్నారు. తనకు నోటీసు వచ్చినా ఫామ్ హౌజ్ కూలగొట్టేస్తానని స్పష్టం చేశారు. తాను గతంలో మంత్రిగా పనిచేశానని, ఎవరితో చెప్పించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రూల్స్ ఎవరికైనా ఒకటేనని, బఫర్ జోన్, ఎఫ్ టీఎల్‌లో ఉన్నట్లయతే తనదైనా కేటీఆర్, హరీశ్‌రావు వైనా కూల్చాల్సిందేనని మహేందర్ రెడ్డి అన్నారు.
"హిమాయత్‌సాగర్‌లో నా ఫామ్‌హౌస్ ఉందని పదే పదే బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్, హరీశ్‌రావును నా ఫామ్‌హౌస్ వద్ధకు తీసుకెళ్తాను. దానిని సర్వే చేసి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్నట్లు నిర్ధారణ అయితే నేనే కూల్చేస్తాను. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెరువుల పరిరక్షణకు మంచి కార్యక్రమం చేపట్టారు. నేను ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నాను". - పట్నం మహేందర్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్