Parents Protest At Jeevadan School In Kamareddy : కామారెడ్డి పట్టణంలోని జీవధాన్ పాఠశాలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాఠశాలలో చదువుతున్న ఆరేళ్ల చిన్నారిపై అదే పాఠశాలకు చెందిన పీఈటీ నాగరాజు విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించాడు. పాఠశాలలో సోమవారం జరిగిన ఈ ఘటనతో పట్టణ పోలీసులు పీఈటీపై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఈ ఘటనపై నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, కౌన్సిలర్లు పాఠశాలకు చేరుకుని మద్దతుగా నిలిచారు. ఆందోళనలో పాల్గొని ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి సముదాయించినా వినకపోవడంతో కాసేపటికి డీఎస్పీ నాగేశ్వర్రావు అక్కడికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. విద్యార్థి సంఘాల ఆందోళనలో తల్లిదండ్రులు కూడా పాల్గొనడంతో పాఠశాలలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు పోలీసులు పాఠశాలకు చేరుకున్నారు. అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి పాఠశాలకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. పాఠశాలలో ఉద్రిక్తత నేపథ్యంలో విద్యార్థులను బయటకు పంపించారు. దాంతో వారు కూడా ఆందోళనలో పాల్గొని వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు.
కొందరు పాఠశాలలోకి దూసుకెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపుచేసేందుకు యత్నించిన పోలీసులు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే కొందరు రాళ్ల దాడి చేయగా కామారెడ్డి పట్టణ సీఐ తలకు గాయమైంది. సీఐతో పాటు పట్టణ ఎస్సై రాజారాం, లింగంపేట ఎస్సై, పలువురు కానిస్టేబుళ్లకు దెబ్బలు తగిలాయి. పరిస్థితి మరింత చేయిదాటకుండా పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.
లాఠీ ఛార్జీని నిరసిస్తూ కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో ఆందోళన కొనసాగించారు. అత్యాచారయత్నానికి పాల్పడ్డ పీఈటీపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్హత లేకున్నా టీచర్లుగా కొనసాగుతున్న వారిని తొలగించాలని, పాఠశాలలో కో ఎడ్యుకేషన్ కాకుండా వేర్వేరు తరగతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అక్కడకు చేరుకున్న కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
పసికూనలపై పైశాచిక చేష్టలు.. బంజారాహిల్స్ ఘటనలో విస్తుపోయే నిజాలు
వెలుగులోకి మరో దారుణం.. బాలికపై ఇద్దరు యువకులు వేర్వేరుగా అఘాయిత్యం