Paleru Canal Ayakattu Farmers Issue In Khammam : ఖమ్మం జిల్లా పాలేరు పాత కాలువ పరిధిలో 20 వేల ఎకరాల్లో స్థిరీకరణ ఆయకట్టు ఉంది. దీని పరిధిలో వరి, చెరకు, మొక్కజొన్న, మిరప పంటలు సాగు చేస్తుంటారు. అయితే గతంలో కన్నా భిన్నంగా ఈసారి పాలేరు జలాశయం (Paleru Reservoir) నుంచి సాగు నీరు అందకపోవడంతో బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. చివరి దశకు వచ్చిన పంటలకు సరిపడా నీళ్లు లేకపోవడంతో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. నవంబర్ 5 తర్వాత పాత కాలువకు నీరు విడుదల కాలేదు. డిసెంబర్ మొదటి వారంలో కురిసిన వర్షాలు అనుకూలించడంతో రైతులు నాట్లు వేసుకున్నారు.
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద పొలాలన్నీ ఎండుడే!
"భూగర్భ జలాలు ఉన్నాయనే నమ్మకంతో నాట్లు పెట్టాం. పాలేరు నీటితో పంటలు పండిస్తాం. పాలేరు ఆయకట్టు కట్టిందే సాగునీటి కోసం. మిషన్ భగీరథ వచ్చాక నీరు పంట పొలాలకు అందివ్వలేని పరిస్థితి. చెరువులు, బావులు లేవు. పాలేరు నీరు వస్తేనే భూగర్భ జలాలు పెరుగుతాయి. నెలకు ఒకటి, రెండు తడులు ఇస్తే మార్చి, ఏప్రిల్ వరకు పంటలు పండిస్తాం. రిజర్వాయర్లో నీరు అందుబాటులో ఉంది. రెండు నెలల నుంచి నీరు ఇస్తామని అధికారులు చెబుతున్నా, ఇవ్వడం లేదు. పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయి. 1 ఎకరానికి రూ.30,000 వరకు పెట్టుబడి పెట్టాం. పాలేరు కాలువ మొదటి నుంచి ఆయకట్టు సాయంతో వ్యవసాయం చేస్తున్నాం. నీరు లేకపోవడంతో ఎకరానికి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు నష్టపోతున్నాం." - పాలేరు ఆయకట్టు పరిధి రైతులు
సాగర్ ఆయకట్టులో యాసంగి ఆశలు ఆవిరి - ఖమ్మం జిల్లాలో అగమ్యగోచరంగా సాగు పరిస్థితి
Paleru Old Canal Ayakattu : ఈ వర్షాలతో బావులు, బోర్లలో జలం పెరగడంతో గత నెలాఖరు వరకు నెట్టుకొచ్చారు. ఆ తర్వాత భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బావులు, బోర్లలో జలం తగ్గింది. నెల రోజుల నుంచి మూడు నాలుగు రోజులకో తడి వేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకొన్నాళ్లు ఇదే పరిస్థితి కొనసాగితే పంటలు పూర్తిగా ఎండిపోవడం ఖాయమని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చొరవ చూపి పంటలను కాపాడేలా నీరు విడుదల చేయాలని కోరుతున్నారు.
"పాలేరు ఆయకట్టు నుంచి రెండు మూడు తడులు ఇస్తారనే ఆశతో పంటలు వేశాం. తీరా పంట ఎదిగే సమయంలో నీరు ఇవ్వకపోగా, మిషన్ భగీరథ పథకం పేరుతో అసలే ఇవ్వడం లేదు. రెండు తడులు ఇచ్చి పంటలు కాపాడాలని అధికారులకు విన్నవించాం." - పాలేరు ఆయకట్టు పరిధి రైతు
'నాగార్జునసాగర్ నీటి విడుదల విషయంలో యథాతథ స్థితి కొనసాగింపునకు ఇరు రాష్ట్రాల అంగీకారం'
పాలేరులో పెద్ద ఎత్తున చనిపోయిన చేపలు.. విషప్రయోగంపై అనుమానాలు