Palamuru Girl Sai Sangeetha Excelling in Athletics : సరదాగా తండ్రితో కలిసి జాగింగ్, రన్నింగ్‌కి వెళుతూ, అథ్లెటిక్స్‌పై మక్కువ పెంచుకుందీ అమ్మాయి. 4వ తరగతిలోనే తన క్రీడా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంది. పతకాల కోసం పరుగులు పెడుతూ, జూనియర్ ఏషియన్ అండర్-20 అథ్లెటిక్ ఛాంపియన్షిప్ వరకు వెళ్లింది. అందులో 4x4 విభాగంలో బంగారు పతకాన్ని సొంతం చేసుకుని భవిష్యత్తుకు గట్టి పునాదిని వేసుకుంది.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చెందిన దొడ్ల శ్యాంసుందర్, రాజేశ్వరీల మొదటి కుమార్తె సాయి సంగీత. శ్యాంసుందర్ నాగర్‌కర్నూల్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతను రాష్ట్రస్థాయి సీనియర్ అథ్లెట్ కావడంతో, కుమార్తెను క్రీడలవైపు ప్రోత్సహించాడు. ఉదయం, సాయంత్రం తనవెంట జాగింగ్, రన్నింగ్‌కి తీసుకువెళ్లడంతో పాటు ఆమెకు అథ్లెటిక్స్‌లో తర్ఫీదు ఇప్పించాడు.
అథ్లెటిక్స్‌లో రాణిస్తున్న పాలమూరు బిడ్డ : చిన్న వయసులోనే అథ్లెటిక్స్‌లో శిక్షణ తీసుకున్న సంగీత, 2014లో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో సత్తాచాటి హకీంపేటలోని క్రీడా పాఠశాలలో చేరింది. అనంతరం హర్డిల్స్, 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్ విభాగాల్లో ప్రత్యేక శిక్షణ పొందింది. 2023-24 విద్యా సంవత్సరంలో కర్ణాటకలోని మంగళూరులోని అల్వాస్ డిగ్రీ కళాశాలలో క్రీడా కోటా కింద సీటు సాధించానని సాయి సంగీత చెబుతోంది.
ఓ వైపు చదువు కొనసాగిస్తూనే అథ్లెటిక్స్‌లో ఆరితేరుతోందీ ఈ యువ క్రీడాకారిణి. 2017లో రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-14 అథ్లెటిక్స్ పోటీల్లో హర్డిల్స్ విభాగంలో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. 2019 కర్ణాటకలో నిర్వహించిన సౌత్‌జోన్ టోర్నమెంట్లో 200 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం దక్కించుకుంది. 2024 ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన ఫెడరేషన్ కప్ టోర్నమెంట్లో 400, 200 మీటర్లలో బంగారు పతకాలు అందుకుని జూనియర్ ఏషియన్ పోటీలకు ఎంపికైంది.
Sai Sangeetha Selection for Asian Athletic Championship : ఏప్రిల్ 24 నుంచి 27 వరకు దుబాయ్ వేదికగా జరిగిన జూనియర్ ఏషియన్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2024 పోటీల్లో ఈ యువ అథ్లెట్ సత్తాచాటింది . 4x4 పరుగుల విభాగంలో బంగారు పతకంతో మెరిసింది. ఇప్పటివరకు 18 రాష్ట్రస్థాయి టోర్నీలతో పాటు 22 జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని పతకాలు సొంతం చేసుకున్నాని చెబుతోంది.
చదువుతో పాటు క్రీడల ద్వారా కూడా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు : అథ్లెటిక్స్‌లో రాణించడం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్‌ల శిక్షణ మరువలేనిదని సంగీత అంటోంది. డిగ్రీ చేస్తూనే ట్రైనింగ్ తీసుకుంటున్నాని తెలియజేస్తోంది. కొవిడ్ సమయంలో ఇంటి దగ్గరే ఉండాల్సి రావడంతో ప్రాక్టీస్ చేయడానికి ఇబ్బంది పడ్డానని వివరిస్తోంది. అమ్మాయిలు క్రీడల వైపు రావాలని సూచిస్తోంది. చదువుతో పాటు క్రీడల ద్వారా కూడా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని చెబుతోంది ఈ యువ క్రీడాకారిణి.
అమ్మాయిలందరికీ స్టడీ ఒక్కటే కాదు, వాళ్లకు దేనిపై అభిరుచి ఉంటే అది చేయాలి. స్పోర్ట్స్ ఫీల్డ్‌లోకి వస్తే ఇంకా బాగుంటుంది. ఎవరో ఏదో అనుకుంటారని కాకుండా మనకు మనం రాణించగలమన్న విశ్వాసంతో ముందుకు రావాలి. అదేవిధంగా పిల్లల అభిరుచికి తగ్గట్టుగా తల్లిదండ్రులు కూడా క్రీడలవైపు ప్రోత్సహించాలి. నా లక్ష్యం ఒలిపింక్స్‌కు ఆడాలని ఉంది.-సాయి సంగీత, క్రీడాకారిణి
ఒలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా సాధన : చిన్నప్పుడు తన చేయి పట్టుకుని పరుగులు పెట్టిన సంగీత, పతకాలు సాధిస్తుంటే చాలా సంతోషంగా ఉందని తండ్రి శ్యాంసుందర్ అంటున్నారు. అంతర్జాతీయ పతకం సాధించాలనే తన కలను, కుమార్తె సాధించేలా ప్రోత్సహిస్తామని చెబుతున్నారు. అదేవిధంగా బాల్యంలోనే సాయి సంగీతలో ఉన్న ప్రతిభను గుర్తించానని ఈమె చిన్ననాటి కోచ్ అంటున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇచ్చానని చెబుతున్నాడు.
రాబోవు రోజుల్లో అంతర్జాతీయ వేదికల్లో పాల్గొని పతకాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. హర్డిల్స్, 100మీటర్లు, 200 మీటర్లు, 400మీటర్ల విభాగాల్లో పతకాల పంట పండిస్తోంది సంగీత. ఒలింపిక్స్ అర్హత సాధించడమే లక్ష్యంగా కఠోర సాధన చేస్తోంది. భవిష్యత్తులో దేశానికి అంతర్జాతీయ పతకాలు తెస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది.
అథ్లెటిక్ కోచ్‌గా ఆదిలాబాద్ అడవి బిడ్డ - గిరిజన విద్యార్థులకు శిక్షణ
వెలిగిన ఒలింపిక్ 'జ్యోతి'- 100రోజుల కౌంట్ డౌన్ షురూ! - PARIS 2024 OLYMPIC FLAME