Open GYM Problems in Sangareddy : ప్రస్తుతమున్న ఆహార అలవాట్ల వల్ల లేదా పని ఒత్తిడి కారణంగా ప్రతిఒక్కరు ఉదయం లేదా సాయంత్రం వ్యాయమం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో గత ప్రభుత్వం లక్షలు వెచ్చించి సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసింది. వ్యాయామంపై అవగాహన ఉన్న కొందరు మాత్రం వాటిని సరైన రీతిలో వినియోగిస్తుండగా, మరికొందరు ఇష్టానుసారంగా వాడటంతో పరికరాలు విరిగిపోయాయి. అధికారులు బాగుచేయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓపెన్ జిమ్‌ల నిర్వహణ మూన్నాళ్లు ముచ్చటగా మారిందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో మెుత్తం 38 వార్డులున్నాయి. ఆయా ప్రాంతాల్లో గత ప్రభుత్వం మహిళలు, చిన్నారులు, పురుషుల కోసం వేర్వేరుగా 25 నుంచి 30 వరకు ఓపెన్ జిమ్ములను ఏర్పాటు చేసింది. తొలినాళ్లలో ఏంతో ఆర్బాటంగా వైభవంగా వీటిని ప్రారంభించి పర్యవేక్షించారు. ప్రస్తుతం నిర్వహణ, శిక్షకులు లేక మరమ్మతులకు గురయ్యాయి. ఇష్టానుసారంగా వాడటంతో కొన్ని పరికరాలు విరిగిపోయాయి. పరికరాలకు గ్రీస్ పెట్టకపోవడంతో శబ్ధం వస్తున్నాయని, బాగు చేసే నాథుడే లేరని జిమ్‌కు వచ్చే స్థానికులు చెబుతున్నారు.
తమ వార్డుల్లో వ్యాయమ పరికరాలు మరమ్మతులకు గురయ్యాయని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలుమార్లు ప్రస్తావించిన ప్రయోజనం లేకపోతుందని స్థానిక కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఓపెన్ జిమ్ముకు ప్రదేశాన్ని బట్టి రూ.5 నుంచి రూ.15 లక్షలు ఖర్చు చేసి జిమ్ములను ఏర్పాటు చేసినట్లు వారు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఓపెన్ జిమ్ముల్లో వ్యాయామ పరికరాలకు మరమ్మతులు చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
త్వరలోనే మరమ్మతులు : ఓపెన్ జిమ్ములు ధ్వంసమైనట్లు, మరమ్మత్తులకు గురైనట్లు తమ దృష్టికి వచ్చిందని సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ తెలిపారు. త్వరలోనే బడ్జెట్ ఆధారంగా మరమ్మతులు చేయిస్తామని స్పష్టం చేశారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తప్పనిసరిగా వ్యాయామం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలుపుతున్నారు.
"జిమ్ములు ధ్వంసం అయినట్లు తమ దృష్టికి వచ్చింది. త్వరలోనే బడ్జెట్ ఆధారంగా మరమ్మతులు చేపతాం. పార్కులలో ఉన్న చెత్తను వీలైనంత త్వరగా తొలగిస్తాం. ఇప్పటి నుంచి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి పార్కులను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తాం." - ప్రసాద్ చౌహాన్, మన్సిపల్ కమిషనర్, సంగారెడ్డి