Protest across india over Doctor rape and Murder : కోల్‌కతాలో పీజీ వైద్యురాలిపై హత్యాచార ఘటన సభ్యసమాజాన్నే తలదించుకునేలా చేసింది. ఈ దుర్ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనల జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ 24 గంటలు దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. రాష్ట్రంలోనూ ఆదివారం ఉదయం 6 గంటల వరకు తమ నిరసనలు కొనసాగుతాయని వైద్యులు తెలిపారు.
వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థినిలు ప్లకార్డులతో నిరసన ర్యాలీ చేపట్టారు. బాధితురాలి కుటుంబసభ్యులకు ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేశారు. 24 గంటలు ప్రజలందరూ సహకరించాలని రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు పగడాల కాళీ ప్రసాద్‌రావు విజ్ఞప్తి చేశారు. వైద్యురాలిపై హత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని నారాయణపేటలో వైద్యులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆపద సమయంలో ప్రాణాలను కాపాడే వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేయడం దుర్మార్గమైన చర్య అని, ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
నిందితులకు కఠిన శిక్షపడేలా చేయాలని డిమాండ్ : వైద్యురాలిపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ సంగారెడ్డి వైద్య కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని, వైద్యులకు రక్షణ కల్పించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని వైద్యులు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో జూనియర్ వైద్యులు నిరసన చేపట్టారు. విధులు బహిష్కరించి వర్షంలోనూ ప్లకార్డులు పట్టుకొని రిమ్స్ నుంచి నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టర్ చౌక్‌లోని కుమురంభీం విగ్రహం చుట్టూ మానవహారం చేపట్టారు.
హత్యాచార ఘటనను నిరసిస్తూ హైదరాబాద్ సనత్‌నగర్‌లో ఈఎస్ఐసీ వైద్య కళాశాల విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఈఎస్ఐ హాస్పిటల్ ఆవరణం నుంచి అమీర్‌పేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. చదువుకుంటున్న చోటే వైద్యురాలిపై అఘాయిత్యం జరగడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఈ సంఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కేవలం ఎమర్జెన్సీ సేవలు ఉంచి మిగతా ఓపీడీ సేవలు, విధులు బహిష్కరించారు.
కొవ్వొత్తులతో వైద్యుల నిరసన : బాధితురాలికి న్యాయం చేయాలని సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో మహేశ్వర మెడికల్ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి, జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హత్యాచారంపై ఎన్ఎస్యూఐ హైదరాబాద్ ఆందోళన చేపట్టింది. ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు డాక్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
'ఈ నెల 9న కోల్‌కతాలోని ఓ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉన్న మహిళ డాక్టర్‌ను అర్ధరాత్రి కొందరు దుండగులు ఆమెను రేప్ చేసి హత్య చేశారు. గత నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో దీనికి నిరసనగా ధర్నాలు చేస్తున్నాం. ఇప్పటివరకు నిందితులను గుర్తించడంలో గానీ, కోర్టముందు హాజరుపరచడంలో గానీ రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అందుకే దేశవ్యాప్తంగా 24 గంటలు మేము వైద్య సేవలను నిలిపివేస్తున్నాం'- పగడాల కాళీ ప్రసాద్ రావు, రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసు - నిరసనగా నిమ్స్‌లో ఓపీ సేవలు బహిష్కరణ