Govt School with Only One Teacher for Seven Classes in Wanaparthy : ఉపాధ్యాయుల బదిలీలు హేతుబద్దంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. పది మంది విద్యార్థులున్న పాఠశాలకు సైతం ఇద్దరు టీచర్లను ఉండాలని సూచించింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో మాత్రం ఇందుకు భిన్నమైన స్థితి నెలకొంది. ఒకటి నుంచి ఏడో తరగతి వరకూ మొత్తం 100 మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయురాలున్నారు.
గతంలో అక్కడ ఓ హిందీ పండిట్, ఓ స్కూల్ అసిస్టెంట్, నలుగురు ఎస్జీటీలు పనిచేసే వాళ్లు. స్కూల్ అసిస్టెంట్ పదవీ విరమణ పొందగా, హిందీ పండిట్‌ను డిప్యుటేషన్‌పై మరో స్కూలుకు పంపించారు. మిగిలిన నలుగురు ఎస్జీటీలే ఏడు తరగతుల్ని నెట్టుకొచ్చే వాళ్లు. తాజాగా ముగ్గురు ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం ఒక్క ఉపాధ్యాయురాలు మాత్రమే మిగిలారు. ఒక్క టీచరే ఏడు తరగతులకు బోధించాల్సి వస్తోంది.
"అప్‌గ్రేడ్ అయినా స్కూల్‌కు హిందీ పండిట్ రాలేదు. సోషల్ బోధించేందుకు ఎస్జీటీ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. ఈ పాఠశాలలో 98 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు ఒక తరగతికి ఒక సబ్జెట్ బోధించినప్పుడు మిగిలిన క్లాస్ విద్యార్థులకు వర్క్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ ఒకే దగ్గర ఉండటం వల్ల కాస్త గందరగోళంగా ఉంటుంది." - రజిత, ఉపాధ్యాయురాలు
బడికి పంపేందుకు ఇష్టపడని తల్లిదండ్రులు : టీచర్లు లేకపోవడంతో పిల్లలకు సక్రమంగా తరగతులు జరగట్లేదు. తల్లిదండ్రులు సైతం బడికి పంపేందుకు ఇష్టపడట్లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యార్థుల సంఖ్య పడిపోయే అవకాశం కనిపిస్తోంది. రామకృష్ణాపురానికి బదిలీపై వీపన్‌గండ్ల మండలం నుంచి ఓ ఉపాధ్యాయుడు రావాల్సి ఉన్నా అక్కడికి రావాల్సిన టీచరు రాకపోవడంతో ఆయన రిలీవ్ కాలేదు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని వెంటనే సమస్య పరిష్కారించాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు.
Telangana Teachers Transfers : బదిలీలపై నలుగురు ఉపాధ్యాయులు ఈ పాఠశాలకు రావాల్సి ఉందని కొత్తకోట మండల విద్యాశాఖ అధికారి కృష్ణయ్య తెలిపారు. వారు అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల రాలేకపోయారన్నారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఎక్కువ కాలం ఒకేచోట పని చేసిన ఉపాధ్యాయులు బదిలీ అయిన అనేక పాఠశాలల్లో ఇదే తరహా సమస్యలు ఎదురవుతున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను సర్దుబాటు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.