Online Cricket Betting Gang Arrest : ఐపీఎల్ సీజన్ మొదలు కావడంతో దేశమంతా క్రికెట్ అభిమానులు ఊగిపోతున్నారు. సాయంత్రం అయిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతున్నారు. అభిమాన ఆటగాడు ఫోర్లు, సిక్సులు బాదితే కేరింతలు కొడుతున్నారు. జట్టు గెలిస్తే సంబరాలు చేసుకుంటున్నారు. అభిమానుల సంబరాలు ఇలా ఉంటే, ఇంకో వైపు ఇదే అదునుగా రాష్ట్రంలో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.
తాజాగా నిర్మల్ జిల్లా భైంసా వాసులతో బ్యాంకు ఖాతాలు తెరిపించి వాటిని ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు వినియోగించిన కేసులో కీలక నిందితుడు చిక్కాడు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో బృందం నిందితుడు కేసర కేశవరెడ్డి అలియాస్ మహా(33)ను బెంగళూరులో పట్టుకున్నారు. అతడిని ఖమ్మం వాసిగా గుర్తించారు. నిందితుడి నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, 7 మొబైల్‌ఫోన్లు, 7 సిమ్‌కార్డులు, 22 సిమ్‌కార్డు వోచర్లు, 10 బ్యాంకు పాస్, చెక్‌బుక్కులు, 19 డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
బెట్టింగ్ ముఠాల ఆటకట్టిస్తున్న పోలీసులు - కోట్లలో నగదు స్వాధీనం - IPL Betting Racket Busted in Hyd
అతడికి గతంలోనే ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ అలవాటున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో 2023 ఫిబ్రవరిలో సామాజిక మాధ్యమాల్లో అతడికి ఐపీఎల్ బెట్టింగ్, గేమింగ్‌కు పాల్పడే కొందరు పరిచయమయ్యారు. అధిక సంపాదన ఆశతో మహా వారితో చేతులు కలిపాడు. బ్యాంకు ఖాతాలు తెరిచి అప్పగించే వ్యక్తుల(మ్యూల్)ను వెదికే పనిని మహాకు ఆ ముఠా అప్పగించింది. బెట్టింగ్ సొమ్మును ఆ ఖాతాల్లోకి బదిలీ చేయించుకోవాలనేది ముఠా పన్నాగం.
బెట్టింగ్‌లకు మ్యూల్ ఖాతాలు : ఈ క్రమంలోనే ప్రణయ్‌షిండే, వాణీకర్ నవీన్, అరుగుల లక్ష్మణ్ మహాకు పరిచయమయ్యారు. మ్యూల్ ఖాతాలు తెరిచి అప్పగించినందుకు సొమ్ము లావాదేవీల్లో 30 శాతం కమీషన్ ఇస్తామని మహా వారికి ఆశ చూపాడు. దీంతో ప్రణయ్ ముఠా భైంసాతోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 125 మందితో మ్యూల్ ఖాతాలు తెరిపించి ఏటీఎం కార్డులు, బ్యాంకు క్రెడెన్షియల్స్, చెక్‌బుక్‌లు మహాకు అప్పగించింది. అలా ఇచ్చినందుకు ఒక్కో ఖాతాదారుకు రూ.5 వేల చొప్పున ఇచ్చారు. ఆ ఖాతాల్లోకే బెట్టింగ్ సొమ్మును మహా బదిలీ చేసుకున్నట్లు దర్యాప్తు క్రమంలో వెల్లడైంది. ఈ ముఠాకు జాతీయ, అంతర్జాతీయ లింకుల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రణయ్, నవీన్, లక్ష్మణ్‌లను అరెస్ట్ చేశారు.
చోరీలు, హత్యలు, ఆత్మహత్యలు - బెట్టింగ్ మాయలో యువత జీవితాలు కల్లోలం - Cricket Betting In Telangana