Onion and Garlic High Prices in Telangana : వంటింట్లో దాదాపు ప్రతి కూరల్లో వాడే ఉల్లిగడ్డ ధర తగ్గడం లేదు. కిలో 20 రూపాయలు ఉండాల్సిన ఉల్లిగడ్డలు దాదాపు కొన్ని నెలలుగా మార్కెట్లో రూ.50 నుంచి 60 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. సాధారణంగా ఉల్లి ధరలు వర్షాకాలంలోనే ఎక్కువగా ఉంటుంది. శీతాకాలంలో అయిన ధర తగ్గుతుందని ఎదురుచూసినా చివరకు ప్రజలకు నిరాశే మిగులుతోంది. ఇక వెల్లుల్లి ధరలు అయితే భగ్గుమంటున్నాయి. సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేని స్థాయికి పెరిగిపోయింది. కిలో వెల్లుల్లి (ఎల్లిగడ్డ) రూ. 100-150 ఉండాల్సి ఉండగా ప్రస్తుతం మార్కెట్లో సుమారు రూ.400 పలుకుతోంది.
స్థానికంగా వీటిని పండించకపోవడం, దిగుమతిపైనే ఆధారపడటం వల్ల వీటి ధరలు తగ్గకపోవడానికి ప్రధాన కారణాలు. రాష్ట్రానికి ఉల్లిగడ్డ మహారాష్ట్ర నుంచి దిగుమతి అవుతుండగా వెల్లుల్లి గుజరాత్ రాష్ట్రం నుంచి వస్తోంది. సరకు ఆయా రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్న నేపథ్యంలో ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఒకప్పుడు పచ్చళ్ల సీజన్‌లోనే వెల్లుల్లి ధర ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం ఈ ఏడాది మొత్తం అదే ధర ఉంటుంది. దీంతో సామాన్య ప్రజలకు భారంగా మారింది.
తగ్గిన సరకు నిల్వలు : నగరంలోని రోజుకు 50 టన్నుల ఉల్లిగడ్డ, వంద బస్తాల ఎల్లిగడ్డ విక్రయమవుతోందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. ధర తక్కువ ఉన్నప్పుడు వెల్లుల్లి రోజుకు సుమారు 200 బస్తాలు మార్కెట్లో అమ్ముడుపోయేదని తెలిపారు. పాత ఉల్లిగడ్డ నిల్వలు లేకపోవడంతో కొత్త సరకు దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. కొత్త సరకు ఉల్లిగడ్డల్లో అయిదు శాతం మురిగిపోతున్నాయని, దీంతో విక్రయానికి పనికి రాకుండా పోతుందని వాపోయారు. ఇప్పట్లో అయితే వీటి ధరలు తగ్గే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ సమాఖ్య (నాఫెడ్) ద్వారా రాయితీపై ఉల్లిగడ్డ విక్రయిస్తోంది. ప్రస్తుతం మార్కెట్ల్లో కిలో రూ. 60 ఉంటే సగం ధరకే అంటే 30 రూపాయలకే ఈ సంస్థ పంపిణీ చేస్తోంది. కానీ ఎక్కడా ఈ విక్రయాలు కనిపించడంలేదు. రాయితీ సరకు నేరుగా హోల్‌సేల్ వ్యాపారులకే వెళ్తోందని ఆరోపణలు ఉన్నాయి. రాయితీ ప్రక్రియ సజావుగా జరిగినా వీటి ధర కొంత మేర దిగివచ్చేది సామాన్యులకు ఊరట కలిగేది.