Buses Stop Between AP And Telangana : గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద హైవేపైకి వరద ప్రవాహంతో జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో తెలంగాణ-ఏపీ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు : విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. ఐతవరం వద్ద నీటి ప్రవాహంతో రహదారులపైకి నీరు చేరుకోవడంతో ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వరంగల్‌లో రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో ఇప్పటికే హైదరాబాద్ వైపు వెళ్లే రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు విజయవాడ బస్టాండ్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు బస్సులు, వాహనాలు సైతం నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
దారి మళ్లింపు : విజయవాడ-హైదరాబాద్ మధ్య తిరిగే ఆర్టీసీ బస్సుల దారి మళ్లించారు. విజయవాడ నుంచి గుంటూరు, పిడుగురాళ్ల మీదుగా హైదరాబాద్‌కు బస్సులు బయలుదేరుతున్నాయి. ఐతవరం వద్ద ఇంకా వరదనీరు ఉండటంతో విజయవాడ-హైదరాబాద్ హైవేపైకి వచ్చిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
Traffic Jams Between AP and Telangana : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ - ఏపీ సరిహద్దు రామాపురం వద్ద చిమిర్యాల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కోదాడ నుంచి వరదనీరు దిగువకు భారీగా ప్రవహిస్తోంది. నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపైకి నీరు చేరింది. దీంతో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నల్లబండగూడెం వద్ద పాలేరు వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. బస్సులోని 30 మంది ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
మరోవైపు వరదలో చిక్కుకున్న ఖమ్మం బాధితులను రక్షించడానికి ఏపీ సీఎం చంద్రబాబుతో, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. మున్నేరు వరద బాధితులను రక్షించడానికి హెలికాప్టర్ల సాయం కోరారు. కాసేపట్లో ఖమ్మం మున్నేరు వద్దకు హెలికాప్టర్లు చేరుకోనున్నాయి. అలాగే విశాఖలోని నేవీ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ఖమ్మం నగరానికి నేవీ హెలికాప్టర్లు పంపించాలని కోరారు. విశాఖ నుంచి కాసేపట్లో 2 హెలికాప్టర్లు ఖమ్మంకు రానున్నాయి.
రెయిన్ ఎఫెక్ట్ : విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించిన రాష్ట్రప్రభుత్వం - HOLIDAY FOR SCHOOLS