Officials Inspections in Stella Panama ship at Kakinada Port : కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచిన స్టెల్లా పనామా నౌకలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బుధవారం ఉదయం కాకినాడ ఎస్పీఎఫ్, కష్టమ్స్ కార్యాలయాల సమీపం నుంచి రెవెన్యూ, పోలీస్, పౌరసరఫరాలు, పోర్ట్, కస్టమ్స్ విభాగాలకు చెందిన 10 మంది అధికారుల బృందం సముద్రంలోకి వెళ్లింది. స్టెల్లా ఎల్ పనామా నౌక వద్దకు చేరుకున్న అధికారులు వెంటనే తనిఖీలు మొదలుపెట్టారు. నౌకలో 5 హాచెస్ ఉండగా ఇప్పటివరకు 3 హాచెస్లో ఉన్న బియ్యం సేకరించారు.
నౌకలో 15 అడుగుల లోతులో బియ్యం నింపేశారు. అయితే అధికారులు మాత్రం పైన ఉన్న. బస్తాల్లోని బియ్యాన్ని సేకరిస్తున్నారు. మిగతా రెండు హ్యాచెస్లోనే బియ్యం నమూనాలు సేకరించనున్నారు. స్టెల్లా నౌక 58 వేల టన్నుల సామర్థ్యం ఉండగా ఇప్పటికే 38 వేల టన్నుల బియ్యాన్ని నింపారు. సేకరించిన నమూనాలు పరీక్షలు చేసిన అనంతరం రేషన్ బియ్యం ఎంత మేర ఉందనేది తేల్చనున్నారు. ఆ తర్వాత నౌకలో బియ్యం సీజ్ చేయాలా లేదంటే నౌకనే సీజ్ చేయాలన్న అంశం అధికారులు తేల్చనున్నారు.
సీజ్ ద షిప్ : నౌకలో 640 టన్నుల పేదల బియ్యం ఉన్నట్లు ఇటీవల కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ గత నెల 27న ప్రకటించారు. ఈ క్రమంలో 29వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) కాకినాడ పోర్టును సందర్శించి ఇక్కడి భద్రత వైఫల్యాలు, కీలక శాఖల పర్యవేక్షణ లోపాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడికక్కడే 'సీజ్ ద షిప్' (Seize the Ship) అని ఆదేశించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి కాకినాడ పోర్టుల వైపు మళ్లింది. కాకినాడ కేంద్రంగా గత ఐదేళ్లు రెచ్చిపోయిన రేషన్ మాఫియా రెక్కలు విరిచేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఈ క్రమంలో వివాదాస్పద నౌక నుంచే ప్రక్షాళనకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన బృందం నౌకను పరిశీలించింది.
బియ్యం అక్రమ ఎగుమతి వెనక పెద్దవాళ్లు - ఓడలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు: పవన్ కల్యాణ్
పోలీసులను వారి పనులను చేసుకోనివ్వండి - నా పని నేను చేస్తా : దిల్లీలో పవన్ కల్యాణ్