Incomplete Samagra Kutumba Survey in Hyderabad : హైదరాబాద్‌లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే దారితప్పింది. నగరంలో వేలాది అపార్టుమెంట్లకు ఎన్యూమరేటర్లు వెళ్లకుండానే వెళ్లినట్లు సర్వే ఫారాలను వారే నింపేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తమకు ఆసక్తి లేదని ఆప్షన్‌తో సర్వే ఫారాలపై సిబ్బందే పేర్కొంటూ సర్వే ముగిసిందనిపిస్తున్నారు. దాదాపు అధికారులు 20 శాతం ఇళ్లల్లో సర్వే చేయలేదు. నగరంలో డిసెంబర్ 2న సర్వే పూర్తయిందని అధికారులు వెల్లడించగా తమ ఇంటికి ఎవరూ రాలేదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఎవరూ రాకపోయిన ఫర్వాలేదంటూ సరిపెట్టుకుంటున్నారు.
కాగా ప్రజల నుంచి సేకరించిన సమాచారం కూడా అసంపూర్తిగా ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ఐఏఎస్ అధికారులు, పురపాలకశాఖ అధికారులు నిత్యం పర్యవేక్షించినప్పటికీ ఫలితం అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. సుమారు 70 ప్రశ్నలతో రూపుదిద్దుకున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పత్రాన్ని చూసి ప్రారంభంలో ప్రజలు తమ వివరాలు ఇచ్చేందుకు వెనకడుగు వేశారు. ఈ నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేయగా వెంటనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దీంతో సర్వేకు వెళ్లే ఎన్యుమరేటర్లకు స్వేచ్ఛ ఇచ్చింది. అయితే ఎక్కువ మంది సిబ్బంది ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోగా.. మరికొందరు దుర్వినియోగం చేశారు. సర్వే చేయడానికి, తిరగడానికి బద్ధకమై కాలనీలోని దుకాణాలు, చెట్ల కింద కూర్చుని వారే సర్వే పత్రాలను పూరించారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఎక్కడెక్కడ జరగలేదంటే : కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లో దాదాపు 25 శాతం ఇంటింటికి స్టిక్కర్లు అతికించలేదు. 90 శాతం అసలు సర్వే జరగలేదు. ఆల్విన్ సొసైటీలో ఇంటింటి స్టిక్కర్లు అంటించగా సర్వే మాత్రం జరగలేదు. బాలానగర్ సాయినగర్‌లో ఇళ్లకు స్టిక్కర్లు అతికించి వదిలేశారు. పాతబస్తీలోని ఛత్రినాక, గౌలిపుర, శ్రీరామ్‌నగర్‌కాలనీ, మూసబౌలి, గాంధీబొమ్మకాలనీ, లంగర్‌హౌజ్‌లోని షేక్‌పేట మారుతినగర్, మారుతినగర్, బంజారాహిల్స్ రోడ్డు నెం.1లోని నవీన్‌నగర్, ఆనంద్‌నగర్‌లోని పలు వీధుల్లో, బేగంపేట మయూరినగర్, బల్కంపేట సాయిబాబా టెంపుల్ వీధి, బ్రాహ్మణవాడి, ఓల్డ్‌కస్టమ్స్ బస్తీ, వనస్థలిపురం ఎస్‌కేడీనగర్, బీఎన్‌రెడ్డికాలనీ, మూసాపేట ఆంజనేయనగర్‌లోని పలు అపార్ట్‌మెంట్లను, నిజాంపేట ఇన్‌కాయిస్‌రోడ్డు, గచ్చిబౌలి జనార్ధన్‌హిల్స్ తదితర ప్రాంతాలను అధికారులు గాలికొదిలేశారు.
సమస్తం ఆన్లైన్లో నిక్షిప్తం : తుది దశకు చేరుకున్న సమగ్ర కుటుంబ సర్వే
'కొందరి ఆచూకీ, చిరునామా తెలియడం లేదు - వారి వివరాలు చెబుతారా ప్లీజ్'