Notice to Director RGV : సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ (Ram Gopal Varma)కు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉంటున్న ఆర్జీవీ ఇంటికి వెళ్లి నోటీసులు పోలీసులు ఇచ్చారు. ఎన్నికలకు ముందు 'వ్యూహం' సినిమా (Vyooham Movie) ప్రమోషన్ సమయంలో నాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ ఎక్స్(X)లో పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు ఇచ్చారు. వ్యక్తిగతంగా వాటిని అందజేసేందుకు ఎస్సై శివ రామయ్య ఆధ్వర్యంలోని బృందం మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంది.
చర్యలు తీసుకోండి : మరోవైపు తుళ్లూరులోనూ రామ్‌గోపాల్‌వర్మపై కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ ఫొటోలను ఆర్జీవీ గతంలో మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు తుళ్లూరు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణిలపై ఆర్జీవీ పోస్టు - పలు స్టేషన్లలో రామ్‌గోపాల్‌వర్మపై కేసులు నమోదు
పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు : సినీ నటుడు, వైఎస్సార్సీపీ నేత పోసాని కృష్ణమురళిపై విజయవాడ భవానీపురం పోలీసులకు జనసేన పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో 2021 సెప్టెంబరు 28న, 2024 ఏప్రిల్ 22న వైఎస్సార్సీపీ కార్యాలయం వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై పోసాని తీవ్రంగా విమర్శలు చేశారని ఆ పార్టీ సెంట్రల్ ఆంధ్రా జోన్ కన్వీనర్ బాడిత శంకర్ పేర్కొన్నారు. ఆ వీడియోలను వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఎక్కువగా వినియోగిస్తూ పవన్ కల్యాణ్ ప్రతిష్ఠను దెబ్బ తీస్తోందని తెలిపారు. పోసాని కృష్ణమురళి, వైఎస్సార్సీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీరెడ్డిపై అనకాపల్లిలో ఫిర్యాదు : సామాజిక మాధ్యమంలో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేశ్, వంగలపూడి అనితపై దుర్భాషలాడుతున్న శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళ సభ్యులు అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డిపై చర్యలకు డిమాండ్ చేస్తూ రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి, యర్రంశెట్టి ఈశ్వరి, చెన్నా సత్యవతి, కె.వసంత ఫిర్యాదు అందించారు.
'వ్యూహం' సినిమా విడుదలపై అక్కడే తేల్చుకోండి - పిటిషనర్‌కు స్పష్టం చేసిన హైకోర్టు
పేరుకే ఆర్జీవీ - కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా వైసీపీనే: కొలికపూడి