No Trust Motion Cases Increasing in Telangana : రాష్ట్ర పురపాలికల్లో అవిశ్వాసాల అలజడి కొనసాగుతోంది. అసంతృప్త కౌన్సిలర్లు సొంత పార్టీ ఛైర్మన్‌లపైనే ఈ తరహా తీర్మానాలను ప్రవేశ పెడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం మారడంతో పురపాలక సంఘాల కౌన్సిలర్లు, నగరపాలక సంస్థల కార్పొరేటర్లు రాజకీయ భవిష్యత్‌కు కొత్తబాటలు వేసుకునే ప్రయత్నంలో రాజకీయం చేయడం మరింత ఊతమిస్తోంది. సుమారు మూడేళ్లుగా ఎదురుచూసిన నేతలు అవిశ్వాసాల నోటీసులు ఇస్తూ వేగం పెంచారు.
మహబూబ్‌నగర్ పురపాలక సంఘం ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌పై కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రవేశ పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఓటింగ్‌లో మొత్తం 36మంది అవిశ్వాసాన్ని సమర్ధిస్తూ ఓటేశారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో 49వార్డులుండగా, అందులో మూడింట రెండో వంతు అంటే 32 మందికి పైగా మద్దతిస్తూ అవిశ్వాసానికి ఓటు వేయాల్సి ఉంటుంది. కాగా 36మంది ఓటు వేయడంతో అవిశ్వాసం నెగ్గినట్లైంది. బీఆర్ఎస్ నేతలు (BRS) శతవిధాలా ప్రయత్నించినా అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను గద్దె దించారు.
హైకోర్టుకు చేరిన అవిశ్వాస తీర్మానాల పంచాయితీ - ప్రభుత్వానికి నోటీసులు జారీ
No Confidence Motion in Suryapet : సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ చైర్ పర్సన్ శిరీష, వైస్ చైర్మన్ పద్మలపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. మున్సిపాలిటీలో 35 మంది కౌన్సిలర్లు ఉండగా ఒకరు మృతి చెందారు. 34మంది కౌన్సిలర్లకు గాను 33మంది హాజరయ్యారు. తీర్మానానికి 29 మంది కౌన్సిలర్లు మద్దతు తెలుపగా, మరో నలుగురు వ్యతిరేకంగా తమ నిర్ణయాన్ని వ్యక్తపరిచారు. దీంతో అవిశ్వాసం నెగినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. నూతన చైర్మన్ ఎన్నికను త్వరలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
ఆలేరు మున్సిపల్ ఛైర్మన్ శంకరయ్యపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (No Trust Mootion) వీగిపోయింది. పురపాలికలో 12 మంది కౌన్సిలర్లు ఉండగా చైర్మన్‌పై ఎనిమిది మంది అవిశ్వాసం ప్రకటిస్తూ ఈ నెల 8న జిల్లా కలెక్టర్‌కు తీర్మాన పత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించగా ఐదుగురు మాత్రమే హాజరయ్యారు. మిగితా ఏడుగురు సభ్యులు హాజరు అవ్వకపోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. అప్పడు కూడా కావాల్సినంతమంది కౌన్సిల్ సభ్యులు ఓటింగ్‌కు హాజరు అవ్వకపోవడంతో అవిశ్వాసం వీగిపోయినట్లుగా ఆర్వో ప్రకటించారు.
ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం - క్యాంపులో 15 మంది కౌన్సిలర్లు
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో పాలకపక్షంలోని ఛైర్మన్ కుర్చీ కోసం చాలాకాలం నుంచి సాగుతున్న కుమ్ములాట చివరికి ఈ నెల 30న అవిశ్వాస తీర్మానం చేపట్టే వరకు వచ్చింది. నర్సంపేట పురపాలికలో 24 వార్డులుండగా 2020 జనవరి 20న 18 మంది కౌన్సిలర్ల మద్దతుతో ఛైర్మన్ పదవిని దక్కించుకున్నారు గుంటి రజనీకిషన్. వారిపై అవిశ్వాసాన్ని కోరుతూ, జనవరి రెండో తేదీన జిల్లా కలెక్టర్‌కు 14 మంది సభ్యులు తీర్మాన పత్రాన్ని అందజేశారు. మెజార్టీ సభ్యులు కోరడంతో ఈనెల 30న అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించాలని కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. దీంతో మున్సిపాలిటీ సభ్యుల మధ్య గ్రూపు రాజకీయం రసవత్తరంగా మారింది.
High Court Stay on No Trust Motion Result in Khammam : మరోవైపు ఖమ్మం జిల్లా సహకార సంఘం బ్యాంకు ఛైర్మన్ నాగభూషయ్యకు కూడా పదవీగండం ఏర్పడింది. ఆయన అధ్యక్షుడిగా ఉన్న వి.వెంకటాయపాలెం ప్రాథమిక సహాకార సంఘంలో ఆయనపైనే అవిశ్వాస తీర్మాణం ప్రవేశ పెట్టారు. జిల్లా అధికారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ఓటింగ్ నిర్వహించారు. సంఘం సభ్యులు 13మంది ఉండగా వారిలో 11మంది తీర్మాణానికి అనుకూలంగా మద్దతిచ్చారు. కోర్టు ఉత్తర్వుల మేరకు అధికారులు ఫలితాలను వెల్లడించలేదు. అవిశ్వాస తీర్మాణంలో నాగభూషయ్య ఓడిపోతే ఆయన జిల్లా బ్యాంకు అధ్యక్ష పదివి కోల్పోతారు. దీనిపై జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కోర్టు అనుమతితో త్వరలోనే అవిశ్వాస తీర్మాన ఫలితాల్ని అధికారులు వెల్లడించనున్నారు.
మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాల పరంపర - మంచిర్యాల, క్యాతనపల్లి పురపాలకల్లో అలజడి
రాష్ట్రంలో అత్యధిక పురపాలికలు, నగరపాలక సంస్థలు బీఆర్ఎస్ ఆధీనంలోనే ఉన్నాయి. కౌన్సిలర్లు, కార్పొరేటర్ల మధ్య అంతర్గత విభేదాలతో పాటు ఛైర్‌పర్సన్‌లను దక్కించుకునే క్రమంలో పలుచోట్ల కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు మద్దతు కూడగట్టుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి (Congress Government) రావడంతో అవిశ్వాస తీర్మానాల కోసం గతంలో ఇచ్చిన నోటీసులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు ఇస్తున్నారు.
నల్గొండ మున్సిపాలిటీని కోల్పోయిన బీఆర్ఎస్ - అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన కాంగ్రెస్