No Rate To Paddy In Nellore : వరద సహాయక చర్యల్లో విజయవాడలో అధికార యంత్రాంగం తీరిక లేకుండా ఉన్నారు. దీనిని అవకాశంగా తీసుకున్న మిల్లర్లు, వ్యాపారులు నెల్లూరు జిల్లాలో ధాన్యం రైతును దగా చేస్తున్నారు. రెండేళ్లుగా ప్రభుత్వంతో పని లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు పుట్టి ధాన్యం 23వేల రూపాయల వరకు కొనుగోలు చేశారు. ఈ సారి నెల్లూరు జిల్లా మిల్లర్లు ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులను అడ్డుకోవడంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. వారం రోజులుగా రైతులు అధికారులకు మోరపెట్టుకుంటున్నా వినేనాధుడు లేరని వాపోతున్నారు.
నెల్లూరు జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 75వేల ఎకరాలకుపైగా ధాన్యం పండించారు. కోవూరు, విడవలూరు, అల్లూరు, నెల్లూరు గ్రామీణంలో వరి కోతలు పూర్తి అయ్యాయి. ధాన్యం అమ్ముకునేందుకు రైతులు సిద్ధం అయ్యారు. రెండేళ్లుగా పుట్టి ధాన్యం 23వేల వరకు ధరలు పలికాయి. దీంతో రైతులు ఆనందంగా ఉన్నారు. వర్షాలను సాకుగా చూపించి స్థానిక మిల్లర్లు, వ్యాపారులు రైతులను దోపిడి చేస్తున్నారు. గతంలో కొనుగోలు కేంద్రాలతో పని లేకుండానే రైతులు మద్దతు ధర పొందారు.
ఈ సారి ఒక్కసారిగా పుట్టి ధాన్యం 17వేల రూపాయలకు పడిపోయింది. వారం రోజులుగా రోజుకు 500 రూపాయలు ధరలు పడిపోతున్నాయి. మిల్లర్లు, వ్యాపారులు కుమ్మక్కయ్యారని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకి వేలల్లో పెట్టుబడులు పెట్టామని అంటున్నారు. వారం నుంచి అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించలేదని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులను అనుమతి ఇవ్వాలని కోరారు.
ధాన్యం ధరలు తగ్గిస్తే కఠిన చర్యలు : ధాన్యం కొనుగోళ్లలో రైతులు నష్టపోకుండా, కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా విక్రయించుకునేలా అన్ని చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. కలెక్టరేట్లో రైతులు, ధాన్యం వ్యాపారులు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బయటి రాష్ట్రాల వారు జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
చెరువులా పంట పొలాలు - చేతికొచ్చిన వరిపైరు కుళ్లిపోయిందని రైతుల ఆవేదన - Crops Damage Due to Floods
స్థానిక వ్యాపారులు కుమ్మక్కై ఇతర రాష్ట్రాల వారిని రానీయకుండా ధరల పతనానికి కారణమైతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కనీస మద్దతు ధర కంటే తక్కువ పలికిన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. ధర గురించి ప్రతి రోజూ సమీక్ష ఉంటుందన్నారు. రాబోయే వారం రోజుల్లో జిల్లాలో వర్షపాతం నమోదయ్యే అవకాశం లేదని వాతావరణశాఖ తెలిపిందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి సత్యవాణి, మార్కెటింగ్ శాఖ ఏడీ అనిత, రైతు సంఘాలు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.
దివిసీమను ముంచిన వరద- సాయం కోరుతున్న అన్నదాతలు - Farmers Problems Due to Floods