Farmer Suicide due to Dharani Issues : అటు పంట పండించడానికి వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్న అప్పును తీర్చలేక, ఇటు ధరణి సమస్యతో సాగుభూమిని అమ్మేసి అప్పును కట్టలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెల్తే జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌కు చెందిన రైతు కుంట రాజేశ్ (30)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజేశ్ ఓ సాాధారణ రైతు. వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్నాడు.
ధరణీలో సమస్య : పంట సాగు కోసం వడ్డీవ్యాపారుల నుంచి అప్పు తీసుకున్నాడు. గత కొంతకాలంగా తాను సాగుచేస్తున్న భూమిలో పంట దిగుబడి సరిగా రాకపోవడంతో, పెట్టుబడి ఖర్చులు మీదపడటంతో రాజేశ్ ఆప్పుల పాలయ్యాడు. దీంతో అప్పు తీర్చేందుకు మూడెకరాల భూమిని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. సదరు భూమి రికార్డులు రాజేశ్ పేరుమీదుగా ధరణిలో నమోదు కాకపోవడంతో, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు.
వాట్సాప్‌లో మెసేజ్ : దీంతో అప్పులు తీర్చేందుకు వేరే మార్గం లేక రాజేశ్ తన వ్యవసాయ భూమిలో చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు రాజేశ్, అర్గుల్ గ్రామ వాట్సాప్ గ్రూప్‌లో తన పరిస్థితిని వివరిస్తూ వాయిస్ మెసేజ్ పెట్టాడు. తాను విక్రయించాలనుకున్న భూమి రాజేశ్ పేరిట పట్టా కాలేదని, విక్రయానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఫలితంగా అప్పులు కట్టలేని పరిస్థితి వచ్చిందని, దీంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మృతుని భార్య లలిత మాట్లాడుతూ పంట పెట్టుబడికి తీసుకున్న అప్పును, ఈనెల 18 లోపు చెల్లించలేకపోతే కుటుంబ పరువు తీస్తామని వడ్డీ వ్యాపారులు హెచ్చరించినట్లు తెలిపారు. వారి బెదిరింపులకు భయపడి గత వారం రోజులుగా తీవ్ర మనోవేదనకు గురైన తన భర్త రాజేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపింది. అధిక వడ్డీ వ్యాపారుల ఒత్తిడి వలన, వ్యవసాయ భూమి తమపై పట్టా కాకపోవడంతో తమకు ఈ గతి పట్టిందని మృతుడి భార్య రోదిస్తూ వెల్లడించింది. మృతుడు రాజేశ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మేడ్చల్ జిల్లాలో దారుణం - భార్య వేధిస్తోందని భర్త బలవన్మరణం!
ప్రేమ వ్యవహారంలో కులం పేరుతో దాడి చేశారని యువకుడి ఆత్మహత్య - young man committed suicide