Nizam Sugar Factory Land Issues : నిజాం చక్కెర కర్మాగారం భూములను పదవీ విరమణ పొందిన కార్మికులకు గ్రాట్యుటీలో కొంత మినహాయించుకొని కేటాయించారు. మరికొందరికి వేలం ద్వారా అమ్మారు. ఇంకొందరికి వివిధ కార్పొరేషన్ల ద్వారా 'వ్యవసాయ భూమి కొనుగోలు పథకం' కింద రాయితీ రుణాలు అందించి మరీ విక్రయించారు. భూమి కొనుగోలు కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్‌ల రుణాలతో 8 వేల 345 ఎకరాలను కొనుగోలు చేయించారు. మొదటి రెండు పద్ధతుల్లో భూమి తీసుకున్న వారికి ఇబ్బందుల్లేవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు బ్యాంకు రుణాలతో కొనుగోలు చేసిన వారికి చిక్కొచ్చి పడింది. ఎకరానికి రూ.20 వేల చొప్పున పాతికేళ్ల కిందట అప్పగించారు. రుణ బకాయిలు తీరాక భూమిపై సర్వ హక్కులు కల్పించారు. పట్టాలు జారీ అయ్యాయి. రైతుబంధు సొమ్ము జమతో పాటు ప్రభుత్వ పథకాలన్నీ వర్తిస్తున్నాయి. రిజిస్ట్రేషన్లు మాత్రం చేయటం లేదు.
నిజాం షుగర్స్పై ప్రభుత్వం ఫోకస్- ఫ్యాక్టరీకి పూర్వవైభవం వచ్చేనా?
కేవలం ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలతోనే రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. కోర్టుకు వెళ్లి ఆర్డరు తెచ్చుకున్న వారికి ఎలాగోలా చేస్తున్నారు. సదరు భూములు మాత్రం నిషేధిత జాబితాలో లేవు. కోర్టు ఖర్చులు, అధికారులు పెట్టే తిప్పలు భరించలేని వారు, రెవెన్యూ ఉద్యోగులను సంప్రదించగా, ఇటీవల కొన్ని రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. రెండున్నరేళ్ల కిందటి వరకు క్రయవిక్రయాలకు అనుమతించిన అధికారులు, ఇప్పుడు అభ్యంతరం చెబుతున్నారు.
"అమ్ముదాం అంటే మూడు ఏళ్లు అయ్యింది. పట్టాలున్నా అమ్మడం కావడం లేదు. పిల్లలు పెళ్లిళ్లకు ఉన్నారు. అమ్ముదాం అనుకుంటే ఎవ్వరూ కొనడం లేదు. మాకు ఇది అమ్మితేనే డబ్బులు. ఇల్లు లేదు. కూలిపోయింది. మాకంటూ డబ్బులు లేవు. పని చేసినప్పుడు స్థలం ఇచ్చారు. దఫాలుగా డబ్బులు కట్టుకుంటూ వచ్చాం. ఇప్పడు అమ్ముదాం అంటే అవ్వడం లేదు. ఉపాధిగా ఇచ్చిన భూమిని మీరే రిజిస్ట్రేషన్ చేయకపోతే మేము బతికేది ఎలా." - బాధిత రైతులు
Court Judgment on Nizam Sugar Factory Land : రెండున్నరేళ్ల కిందట నుంచి రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. దీనిపై కొందరు రైతులు కోర్టుకు వెళ్లటం, అక్కడ రెవెన్యూ అధికారులు ఎస్సీ అభివృద్ధి శాఖ లేఖ కారణంగానే రిజిస్ట్రేషన్లు నిలిపి వేసినట్లు చెప్పగా, కోర్టు ఈ వాదనను సమర్థించలేదు. రుణ సహాయంతో కొనుగోళ్లు జరిగాయని, ఇంతకాలం క్రయ విక్రయాలకు అనుమతించారని, పైగా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినవి కావని, నిషేధిత జాబితాలో లేవని కోర్టు తెలిపింది.
నిజాం చక్కెర ఫ్యాక్టరీ ప్రారంభంపై ప్రభుత్వం కసరత్తు - కార్మికుల్లో చిగురిస్తున్న ఆశలు
ఉన్నత స్థాయి నుంచి ఎలాంటి అదేశాలు లేకుండా రిజిస్ట్రేషన్లు నిలిపివేసే నిర్ణయం సరికాదని, బాధితుల హక్కులు హరించినట్లు అవుతుందని స్పష్టం చేసింది. దీంతో కోర్టుకు వెళ్లిన వారికి రిజిస్ట్రేషన్లు చేయక తప్పలేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూముల రిజిష్ట్రేషన్లు నిలిచిపోవడం వల్ల ఆపద సమయంలో, అవసరానికి అమ్ముకోవడానికి వీల్లేకుండా పోయింది. భూమి ఉన్నా అవసరానికి నిరుపయోగంగా మారడం పట్ల భూ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
చెరకు రైతులకు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం కృషి : మంత్రి దామోదర