NIMS Giving Free Gene mutation tests in Hyderabad : జన్యుపరమైన సమస్యలు, జీవనశైలి మార్పులు, కొన్ని రకాల క్రిమిసంహారకాలు సహా అనేక రకాలైన అంశాలు క్యాన్సర్‌కి దారి తీస్తుంటాయి. ఒక్కసారి ఈ మహమ్మారి బారిన పడితే మానసికంగా, శారీరకంగానే కాదు ఆర్థికంగా కుంగిపోవాల్సిన దుస్థితి. సాధారణంగా క్యాన్సర్‌కు కీమో, రేడియో థెరపీ చికిత్సలే అందుబాటులో ఉన్నాయి. కొన్ని రకాల క్యాన్సర్‌లకు శస్త్రచికిత్సలు చేసే అవకాశం ఉంది. కీమో, రేడియో థెరపీల వల్ల క్యాన్సర్ కణాలతో పాటు ఆరోగ్యంగా ఉన్న కణాలకూ నష్టం కలుగుతుంది. అధిక మొత్తంలో ఇచ్చే ఔషధాలు రోగులపై దుష్ప్రభావాలు చూపుతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చిందే 'పర్సనలైజ్డ్ మెడిసిన్'. క్యాన్సర్ రోగిలో జీన్ మ్యుటేషన్లను గుర్తించి అందుకు అనుగుణంగా చికిత్స అందిస్తారు. ఇందుకోసం రోగిలో మ్యుటేషన్లను గుర్తించేందుకు మాలిక్యులార్ జెనెటికి పరీక్షలు చేయాల్సి ఉంటుంది.
NIMS Providing free Cancer Tests : పెద్దపెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే నిర్వహించే జీన్ మ్యుటేషన్ల పరీక్షలు అత్యంత ఖరీదైనవి కావటంతో రోగులకు ఇబ్బందులు తప్పటం లేదు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ రీసెర్చ్ విభాగం ఐసీఎంఆర్‌తో కలిసి డైమండ్స్ ప్రాజెక్టు చేపట్టింది. దేశవ్యాప్తంగా 12 చోట్ల ఈ పరీక్షలను ఉచితంగా అందిస్తున్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలోనూ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఊపిరితిత్తులకు సంబంధించి ఈజీఎఫ్ఆర్, ఏఎల్కే, ఆర్ ఓఎస్-1, రొమ్ము క్యాన్సర్‌కి సంబంధించి ఈఆర్ పీఆర్, హెచ్ ఇఆర్-2 వంటి టెస్టులు అందుబాటులో ఉన్నాయి.
ప్రమాదకర క్యాన్సర్‌కు మందు!- టీకా క్లినికల్ ట్రయిల్స్ సక్సెస్!! - MELANOMA Cancer VACCINE
"ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్‌కు మాలిక్యులర్ బయో మార్కర్స్ పరీక్షలు చేస్తున్నాం. బ్లడ్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యుమర్ వంటి క్యాన్సర్ల నిర్థరణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. త్వరలోనే కోలన్ క్యాన్సర్ పరీక్షలు ప్రారంభిస్తాం. మన దగ్గర అత్యంత ఆధునికమైన సౌకర్యాలు ఉన్నాయి. నిమ్స్ ఆస్పత్రి నుంచే కాకుండా రాష్ట్రంలో ఇతర ఆస్పత్రులు, వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చే నమూనాలు కూడా పరీక్షిస్తున్నాం. డైమంట్ ప్రాజెక్టులో భాగంగా ఈ సేవలు ప్రారంభించాం. ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్‌కు మాలిక్యులర్ టెస్టులు ఉచితంగా చేస్తున్నాం." - డాక్టర్ శాంతివీర్ జి.ఉప్పిన్, నిమ్స్ పాథాలజీ అధిపతి
NIMS Selected Diamond Project in Country : డైమండ్స్ ప్రాజెక్ట్‌కి నిమ్స్‌ను ఎంపిక చేసిన కేంద్రం ఏటా కోటి రూపాయల నిధులు అందిస్తోంది. టెస్టుల నిర్వహణ, పరికరాల కొనుగోలు, సిబ్బంది జీతాల కోసం ఈ డబ్బులు వినియోగిస్తున్నారు. అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేసిన నిమ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని రోగులకు ఉచితంగా జీన్ మ్యుటేషన్ టెస్టులు నిర్వహిస్తోంది. ఈ పరీక్షల ద్వారా టార్గెటెడ్ థెరపీ అందించటం సులభంగా మారడం సహా రోగుల జీవితకాలం 4 నుంచి 5 ఏళ్లకు పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. అవయవ మార్పిడికి అవసరమైన క్రాస్ మ్యాచింగ్ పరీక్షలు కూడా నిమ్స్‌లో ఉచితంగా చేస్తున్నారు. అత్యంత ఖరీదైన జీన్ మ్యుటేషన్ పరీక్షలు ఉచితంగా చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
క్యాన్సర్ నుంచి డీహైడ్రేషన్ వరకు - తాటి ముంజలతో ఎన్నో బెనిఫిట్స్! - Ice Apple Health Benefits