Nanoven Covers Making in karimnagar : ఆర్థికష్టాలు బాధిస్తున్నా, భవిష్యత్తును చీకట్లు కమ్మేస్తున్నాయని భయపడిపోలేదు ఈ యువకుడు. ఎలాగైనా అప్పుల ఊబిలోంచి కుటుంబాన్ని బయటపడేయాలని ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించాడు. తనకీ, సమాజానికి ఉపయోగపడే ఓ చక్కని పరిష్కారం కనుగొన్నాడు. నానోవెన్ కవర్ల తయారీకి శ్రీకారం చుట్టి, సొంతూళ్లోనే మంచి ఆదాయం గడిస్తున్నాడు. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్‌కు చెందిన ఈ యువకుడి పేరు వేల్పులు నిఖిల్ కుమార్. 2017లో బీటెక్ పూర్తయ్యేసరికే కుటుంబం అప్పుల బాధలో మునిగిపోయింది.
సైట్ ఇంజినీర్‌గా ఉద్యోగం : తండ్రి ప్రభాకర్ సంపాదన అంతంతమాత్రమే. తల్లి కుట్టుపని చేస్తున్నా ఇల్లు గడవడం కష్టంగా మారింది. దీంతో పైచదువులకు వెళ్లాలనే ఆశలు వదిలేసుకున్నాడు నిఖిల్. కుటుంబానికి ఆసరాగా ఉండాలని కరీంనగర్‌లోని ఓ కంపెనీలో, సైట్ ఇంజినీర్‌గా చేరాడు. సైట్ ఇంజినీర్‌గా రోజంతా కష్టపడినా, నిఖిల్‌కు 15 వేల వేతనమే దక్కేది. ఆ కాస్త ఆదాయంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేక సతమతమయ్యాడు.
పలకరించిన నష్టాలు : ఉద్యోగంలోనూ పని ఒత్తిడి ఎక్కువవడంతో, ఈ సమస్యకు శాశ్వతపరిష్కారం కనుగొనాలని నిశ్చయించుకున్నాడు. ఇంట్లో వాళ్లతో చర్చించి, నానోవెన్ కవర్ల తయారీ ప్రారంభించాడు. ఎన్నోఆశలతో వ్యాపారం మొదలుపెట్టిన నిఖిల్‌ను, మొదటి 6 నెలలు నష్టాలే పలకరించాయి. ఊళ్లో ప్లాస్టిక్ కవర్ల వాడకం అధికంగా ఉండటంతో, నానోవెన్ కవర్లు కొనేవారే కరవయ్యారు. దీంతో మున్సిపల్ అధికారులతో మాట్లాడి ఊళ్లో ప్లాస్టిక్ వాడకం తగ్గేలా చూశాడు.
లాభాల బాట : క్రమంగా వ్యాపారం పుంజుకుంది. ఇప్పుడు అన్ని ఖర్చులూ పోను నెలకు 50వేల రూపాయలకు పైగా ఆదాయం లభిస్తోందని అంటున్నాడు నిఖిల్. మధురైకి వెళ్లి నానోవెన్ కవర్ల తయారీ విధానం గురించి నేర్చుకున్నానని చెబుతున్నాడు నిఖిల్. మొదట్లో మధురైలోనే ముడిసరకును కొనుగోలు చేసేవాళ్లమని, ఇప్పుడు హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటున్నామని అంటున్నాడు. తనకే కాక తోటివారికీ మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ వ్యాపారం మొదలుపెట్టాడు నిఖిల్.
మంచి ఆదాయమే లభిస్తున్నా, యంత్రాలు లేక నెలకు 15రోజులే పనిచేస్తున్నామని అంటున్నాడు. భవిష్యత్తులో యంత్రాల సంఖ్యను పెంచి, మరింత మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడు. తమ కుమారుడు ఈ వ్యాపారం పెట్టడం వల్ల తమ కష్టాలు తీరాయని చెబుతున్నారు నిఖిల్ తల్లిదండ్రులు. ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలుచేస్తే, తమలాంటి వారికే కాక సమాజానికీ మంచి జరుగుతుందని అంటున్నారు.
అప్పుల బాధలోంచి బయటపడాలని వ్యాపారం ప్రారంభించిన నిఖిల్‌కు, మొదట్లో లాభాలకు బదులుగా నష్టాలే స్వాగతం పలికాయి. అయినా ధైర్యం కోల్పోకుండా ప్రణాళికతో బిజినెస్ చక్కదిద్దుకున్నాడు. నిరుద్యోగిగా ఉన్నామని నిరాశపడుతూ కూర్చోకుండా, పరిష్కారం కోసం ప్రయత్నిస్తే విజయం మీదే అంటున్నాడు.
"2017లో బీటెక్ పూర్తయ్యింది. అప్పులు బాగా ఉండటంతో పైచదువులకు వెళ్లాలనే ఆశలు వదిలేసుకున్నాను. కొన్నిరోజులు సైట్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేశాను. పని ఒత్తిడి ఎక్కువవడంతో, ఈ సమస్యకు శాశ్వతపరిష్కారం కనుగొనాలని నిశ్చయించుకున్నాను. ఇంట్లో వాళ్లతో చర్చించి, నానోవెన్ కవర్ల తయారీ ప్రారంభించాను. ఇప్పుడు అన్ని ఖర్చులూ పోను నెలకు 50వేల రూపాయలకు పైగా ఆదాయం లభిస్తోంది". - నిఖిల్, యువవ్యాపారవేత్త