Telangana Weather Updates : రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇవాళ, రేపు వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(IMD) ప్రకటించింది. హైదరాబాద్‌లోనూ తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని తెలిపింది. ఉష్ణోగ్రతలు 42-43°C దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రెండు రోజులు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3గంటల ప్రాంతంలో ప్రజలు బయటకు రావద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
వడగాల్పుల తీవ్రత ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఈనేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీచేసింది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 7 తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని స్పష్టంచేసింది.
IMD ON High Temperatures : 2016 తర్వాత ఈ ఏడాది అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు (Officials) తెలిపారు. రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు డిగ్రీలు అధికంగా ఉంటున్నాయని వెల్లడించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు వేడి తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. వృద్దులు, పిల్లలు ఈ సమయంలో బయటకు రావొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు ఈ విధంగా ఉంటే, ముందు ముందు ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.