NEW MSME Policy In Telangana : గత దశాబ్ద కాలం నుంచి రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పెట్టుబడులు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. 2014 నుంచి టీఎస్ ఐపాస్ ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నమోదు 11 నుంచి 15శాతం పెరుగుతూ వచ్చింది. సగటు పెట్టుబడి 2018లో కోటి రూపాయలు ఉండగా 2022కు 2.15కోట్లకు పెరిగింది. రాష్ట్రంలో భౌగోళికంగా, ఇతర అంశాలపరంగా ఎన్నో సానుకూలమైన అంశాలున్నప్పటికీ ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రావడం లేదని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంది.
చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పిస్తూ : మధ్యతరహా పరిశ్రమల నమోదు అతి తక్కువగా ఉందని సర్వేలో తేలింది. తయారీ సంస్థలు 2.9 శాతం, సేవా రంగంలో 3.5 శాతమే పురోగతి ఉన్నట్లు తేలింది. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన టీఎస్‌ఐపాస్ ద్వారా కేవలం బహుళజాతి కంపెనీలకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా విధానాలున్నాయని గుర్తించిన పరిశ్రమల శాఖ చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహాలు ఇస్తూ నూతన పాలసీని రూపొందించింది. ఇండస్ట్రీ 4.0 పేరుతో నిర్ధిష్టమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం దీనికి రూపకల్పన చేసింది.
ఉన్నతస్థాయి పర్యవేక్షణ కమిటీ : చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు అవరోధంగా ఉన్న అంశాలను పరిష్కరించేలా నూతన విధానంలో ఏర్పాట్లు చేశారు. ఇందులో ప్రధానంగా ఆరు విషయాలను పరిగణనలోకి తీసుకున్నారు. భూమి, రుణసాయం, ముడి సరుకులు, వ్యాపారపరమైన మెలకువలు, నూతన సాంకేతికత, మార్కెట్ సదుపాయం కల్పించడం వంటి వాటిపైనే ప్రధానంగా దృష్టి సారించారు. దీన్ని బట్టి సంస్థల ఏర్పాటు దగ్గర నుంచి అమ్మకాల వరకు ప్రభుత్వం ప్రతి అంశంలోనూ చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వం చేదోడువాదోడుగా నిలవనుంది.
దీనికోసం ప్రత్యేకంగా ఉన్నతస్థాయి పర్యవేక్షణ కమిటీని సైతం ఏర్పాటు చేసింది. పరిశ్రమల మంత్రి, ముఖ్యకార్యదర్శి, పరిశ్రమల కమిషనర్, డైరెక్టర్, పారిశ్రామికవేత్తల నుంచి కొంత మంది ప్రతినిధులు ఈ కమిటీలో ఉంటారు. పారిశ్రామికవేత్తల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం. క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలుపర్చాలనే నివేదికను రూపొందించి వాటిని అమలు చేసేలా ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీ చూడనుంది.
రాష్ట్రంలో 26 లక్షలకు పైగా సూక్ష్మపరిశ్రమలే : ఎంఎస్‌ఎంఈల రిజిస్ట్రేషన్ ఖర్చుతో కూడుకున్న పని అని పలువురు వెనకడుగు వేస్తున్నారు. కార్మికుల వేతనాలు పెరగడం కూడా యాజమానులకు ఇబ్బందిగా మారింది. ఇవన్నీ ఒక ఎత్తైతే, భూమి, భవన నిర్మాణాల కోసమే 40 నుంచి 50శాతం ఖర్చు చేయాల్సి వస్తోంది. తగిన వనరుల లేమి, భూమి ధర, శ్రామిక ఖర్చు ఎక్కువగా ఉండడం వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. నిర్వహణ ఖర్చులు తగ్గించి, మార్కెటింగ్ సౌకర్యంతో పాటు సాంకేతిక తోడ్పాటు అందించే విధంగా ఉన్నతస్థాయి పర్యవేక్షణ కమిటీ పనిచేయనుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 35లక్షల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉండగా, వీటిలో 26లక్షలకు పైగా సూక్ష్మ పరిశ్రమలే ఉన్నాయి. ఇందులో 30లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. ఇవి కుడా తయారీ, సేవలు, రిటైల్, హోల్‌సేల్ విభాగాల్లో పని చేస్తున్నాయి. మధ్యతరహా పరిశ్రమలైతే కేవలం వెయ్యి వరకే ఉన్నాయి. వీటి ద్వారా లక్ష మందికి పైగా ఉపాధి లభిస్తోంది. ఆ తర్వాత ఆహార తయారీ, ఖనిజ, చెక్క ఆధారిత, ఇంజనీరింగ్, ఎఫ్‌ఎంసీజీ, టెక్స్‌టైల్స్, ఆటో విడిభాగాల రంగాలు పని కల్పిస్తున్నాయి.
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేవిధంగా : ఎంఎస్‌ఎంఈలు నిర్వహిస్తున్న వారిలో ఎస్సీలు 15శాతం, ఎస్టీలు 9శాతం, బీసీలు 28శాతంగా ఉన్నారు. రాష్ట్రంలో మహిళల జనాభా 1.88కోట్లు ఉండగా 58వేల మంది మాత్రమే పారిశ్రామికవేత్తలు. ఇది జనాభాతో పోలిస్తే 3.1శాతం. నూతన విధానంలో ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే విధంగా రాయితీలు కల్పిస్తున్నారు.
రాష్ట్రంలో ఉన్న అనుకూల పరిస్థితులను బట్టి ఇంకా భారీ సంఖ్యలో ఎంఎస్‌ఎంఈ ఏర్పాటు కావాల్సి ఉంది. దీని ద్వారా లక్షల సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వీలుందని ప్రభుత్వం భావిస్తోంది. సూక్ష్మ పరిశ్రమలతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు భారీగా ఏర్పాటయ్యేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా సరైన ప్రోత్సాహం లేక ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు మూతపడుతున్నాయి. మహారాష్ట్రలో 5వేలకు పైగా, తమిళనాడులో 2456, గుజరాత్‌లో 1600కు పైగా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు మూతపడ్డాయి. వీటితో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి ఆశించిన దానికంటే మెరుగ్గానే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కేవలం 231 పరిశ్రమలే మూతపడ్డాయి.
యువతకు ఉపాధి అవకాశాలు : ఎంఎస్‌ఎంఈలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించి నిలదొక్కుకునే విధంగా చేయాలనేదే ప్రభుత్వ సంకల్పం. రాష్ట్ర జీడీపీలో ఎంఎస్‌ఎంఈల వాటా 10శాతానికి పెంచాలని సంకల్పించారు. కొత్తగా నమోదయ్యే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏటా 15శాతానికి పెంచాలని నిశ్చయించుకున్నారు. దీని ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఆర్థిక వృద్ధి, ఉత్పాదక పెరుగుతుందని, సాంకేతికత విరివిగా అందుబాటులోకి వస్తుందని పరిశ్రమల శాఖ చెబుతోంది.
రాష్ట్రంలో యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలంటే అది అసాధ్యమైన పని. పరిశ్రమల ఏర్పాటు ద్వారా 20శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచాలని, ఇందులో 30శాతం ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళలకే కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.