NDA Govt Develop Railway Stations in AP : రాష్ట్రంలో చాలా రైల్వేస్టేషన్లు ఇప్పటికీ అపరిశుభ్రంగానే ఉన్నాయి. సరైన వసతుల్లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమైన రైల్వేస్టేషన్ల రూపురేఖలు మార్చేలా ఎన్డీయే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధాన స్టేషన్లను ఏకంగా విమానాశ్రయాల తరహాలో అత్యద్భుతంగా తీర్చిదిద్దుతోంది. కోట్ల రూపాయలు వెచ్చించి కళ్లు చెదిరేలా నిర్మాణాలు చేపడుతోంది. వీలైనంత త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు శరవేగంగా పనులు సాగుతున్నాయి.
రైల్వే స్టేషన్లకు కొత్త సొబగులు : రైల్వే ప్రయాణికులకు అంతర్జాతీయ సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లను ఆధునీకీకరిస్తోంది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ABSS) కింద కీలక నగరాలు, పట్టణాలు, పుణ్యక్షేత్రాలు కలిగిన రైల్వే స్టేషన్లకు కొత్త సొబగులు దిద్దుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మరో 53 రైల్వే స్టేషన్లను 1397.4 కోట్ల వ్యయంతో అత్యాధునీకరిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని శంకుస్థాపన చేయగా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అధికారులు పనులను వేగవంతం చేశారు.
విజయవాడ రైల్వేస్టేషన్‌కు అరుదైన ఘనత - ఎన్‌ఎస్‌జీ1గా గుర్తింపు - NSG 1 designation for Vijayawada
ఎన్డీఏ సర్కార్ చర్యలు : అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద అభివృద్ధి చేసే రైల్వేస్టేషన్ల మాస్టర్ ప్లాన్లు, ముఖ ద్వారాలు, భవనాల నిర్మాణ శైలికి సంబంధించిన చిత్రాలను రైల్వే శాఖ విడుదల చేసింది. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి రైల్వే స్టేషన్‌ను విమానాశ్రయం తరహాలో అభివృద్ధి చేస్తున్నారు. దీని కోసం ఏకంగా రూ. 300 కోట్లు వెచ్చిస్తున్నారు. కట్టిపడేసేలా ఆకృతులను తీర్చిదిద్దుతున్నారు. ప్రయాణికుల కోసం విశ్రాంతి గదులు, ఏసీ డార్మెటరీలు కడుతున్నారు. తిరుచానూరు రైల్వే స్టేషన్‌లోనూ యాత్రికుల రద్దీని తగ్గించేలా క్రాసింగ్ స్టేషన్‌గా అభివృద్ధి చేస్తున్నారు. రూ. 102 కోట్లతో నెల్లూరు రైల్వే స్టేషన్ లోనూ పునరాభివృద్ధి పనులు సాగుతున్నాయి. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌ను రూ. 214 కోట్ల రూపాయలతో తీర్చిదిద్దుతున్నారు.
త్వరలోనే అందుబాటులోకి : అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో భవిష్యత్ అవసరాలను ఊహించి అందుకు అణుగుణంగా ప్రధాన రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. స్టేషనుకు వచ్చిపోయే రోడ్లను వెడల్పు చేస్తున్నారు. పాదచారుల కోసం ప్రత్యేక మార్గాలు, పార్కింగ్ ప్రదేశం ఏర్పాటు చేస్తున్నారు. స్టేషన్‌లోకి అడుగుపెట్టగానే వావ్ అనేలా నిర్మాణాలు తీర్చిదిద్దుతున్నారు. ప్రయాణికులకు ఆహ్లాదకరంగా ఉండేలా ల్యాండ్ స్కేపింగ్, గ్రీనరీ, స్థానిక కళలు, సాంస్కృతిక చిహ్నాలు ఏర్పాటు చేయనున్నారు. ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్' పథకం కింద స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు.
విశాఖలో ప్లాట్‌ఫామ్ పైకి ఒకేసారి రెండు రైళ్లు - తికమకతో ప్రయాణికుల పరుగులు - TRAIN PASSENGERS PROBLEM IN VISAKHA
విమానాశ్రయం తరహాలో మెరుగులు : ఇవే కాకుండా అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద పలు జిల్లాల్లోని స్టేషన్లలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అనకాపల్లి స్టేషన్‌ను రూ. 27.10 కోట్లు, ఎలమంచిలి స్టేషన్ కోసం రూ. 13.13 కోట్లు కేటాయించారు. భీమవరం స్టేషన్‌కు రూ.22.13 కోట్లు, మంగళగిరి రైల్వే స్టేషన్‌కు రూ. 13.6 కోట్లు వెచ్చించి సదుపాయాలు మెరుగుపరుస్తున్నారు. ఒంగోలుకు రూ. 19.10 కోట్లు, కడప రైల్వే స్టేషన్లలో రూ. 20.35 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. రేణిగుంట, గూడూరు రైల్వే స్టేషన్లను మరింత అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. అంతేకాదు విజయవాడ రైల్వే స్టేషన్‌ను సైతం రూ. 750 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు పంపారు. వీటికి ఆమోదం రాగానే పనులు మొదలుపెట్టి విమానాశ్రయం తరహాలో మెరుగులు దిద్దనున్నారు.
రెండు నుంచి నాలుగు - విశాఖ-విజయవాడ రైల్వే ట్రాక్‌ల విస్తరణ - Vijayawada Visakha railway track