NDA Government Issue New Ration Cards 2024 : రాష్ట్రంలో రేషన్ కార్డులు కొత్త డిజైన్లతో అందుబాటులోకి రానున్నాయి. గతంలో జగన్ చిత్రాలతో ముద్రించిన రేషన్ కార్డుల స్థానంలో కొత్త సాంకేతికత జోడించి కార్డులు ముద్రించి ఉచితంగా అందజేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజా సమీక్షలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ మేరకు త్వరలో తీసుకొస్తామని వెల్లడించారు. ఇందుకు ఆ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అర్హులందరికీ పోర్టిఫైడ్ బియ్యం అందజేస్తోంది. ఈ రకం బియ్యంతో ఐరన్ లోపం నివారణకు ఆస్కారం కలుగుతోంది. అదే విధంగా కార్డుల ఆధునికంగా తయారు చేసి పేదలకు ఇవ్వాలన్న సంకల్పం కాగా ఇవన్నీ మున్ముందు ఏర్పాటు చేయబోయే రైస్ ఏటీఎంలకు అనుసంధానంగా తీర్చిదిద్దనున్నారు.
రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్ - నేటి నుంచి నాలుగు వస్తువులు సరఫరా
ఆహార భద్రత చట్టానికి అనుగుణంగా : జగన్ సర్కార్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేయడంలో ఆలస్యం చేసింది. కొత్త కార్డులకు 6 నెలలు ఆగాల్సిన దుస్థితి కాగా కూటమి ప్రభుత్వం కొత్త జంటలకు వెంటనే కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే తీరుగా ఆహార భద్రత చట్టం 2013 అమలు మేరకు కార్డులు అందించాల్సి ఉంది. ఇందుకు గతంలో వైఎస్, జగన్ చిత్రాలతో కార్డులు ఉండగా వాటిని తొలగించనుంది.
గుడ్‌న్యూస్ - డిజిటల్ కార్డులు కొలిక్కి రాగానే 'కొత్త రేషన్‌కార్డులు'
కొత్త జంటలకు కార్డులు : కొత్తగా పెళ్లయిన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలన్న నిర్ణయం అమల్లో ఉంది. దీంతో అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్తగా కార్డులు ఇవ్వనున్నారు. కొత్త జంటలతో పాటు తల్లిదండ్రుల నుంచి విడిపోయిన వారికి, ఒంటరిగా ఉన్న వారికి కొత్తగా బియ్యం కార్డులు దక్కనున్నాయి. కొత్తగా జారీ చేసే రేషన్‌కార్డులకు క్యూఆర్ కోడ్‌తో పాటు కుటుంబ సభ్యుల చిత్రాలతో కూడిన కార్డులు ఇవ్వనున్నారు.
రైస్ ఏటీఎంల ఏర్పాటు : ఇప్పటికే చౌక దుకాణాల్లో ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో రైస్ ఏటీఎంలు ప్రారంభించారు. దీంతో అక్కడి లబ్ధిదారులకు ఊరటగా ఉంది. క్యూలైన్లులో గంటల తరబడి నిలబడకుండా నిమిషాల్లోనే సరకులు తీసుకొనే అవకాశం కలిగింది. ఇదే తీరుగా ఏపీ కూడా రైస్ ఏటీఎంలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.