Natural Death Relief Scheme for Workers : తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగానే.. తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలి, కార్మిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో.. 'సహజ మరణం' పొందిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తోంది. చనిపోయిన కార్మికుల నామినీకి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. ఈ విషయం చాలా మంది కార్మికులకు తెలియదు. మరి, ఇందుకు కావాల్సిన అర్హతలు ఏంటి? ఏ పత్రాలు అవసరం? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం "నేచురల్ డెత్ రిలీఫ్" పేరిట ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ స్కీమ్ కింద సహజం మరణం పొందిన కార్మికుడి నామినీకి, డిపెండెంట్‌కు లేదా చట్టపరమైన వారసులకు రిలీఫ్ ఫండ్ కింద రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తారు.
అర్హతలు :
- మరణించిన కార్మికుడు తెలంగాణ భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డులో సభ్యుడై ఉండాలి. అంటే.. ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డు కలిగి ఉండాలి.
- ఆర్థిక సాయం కోసం అప్లై చేసే వ్యక్తి.. మరణించిన భవన కార్మికుడి నామినీ, లేదా చట్టపరమైన వారసుడై ఉండాలి.
మీకు ఈ కార్డు ఉందా? - లేకపోతే చాలా పథకాలు మిస్ అయినట్లే- ఎలా అప్లై చేయాలో తెలుసా?
దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాలు :
- దరఖాస్తుదారుడి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
- మరణించిన కార్మికుడి రిజిస్ట్రేషన్ కార్డ్ (ఒరిజినల్)
- కార్మికుడి కుటుంబం రేషన్ కార్డ్/ఆధార్ కార్డ్ (నామినీ డిపెండెంట్ ప్రూఫ్ కోసం)
- రెన్యూవల్ చలాన్ కాపీ
- డెత్ సర్టిఫికెట్
- అడ్వాన్స్ స్టాంపెడ్ రశీదు
- బ్యాంక్ పాస్‌బుక్ కాపీ
దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే?
- ఇందుకోసం ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దరఖాస్తుదారులు ముందుగా ఈ స్కీమ్‌కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్‌ని పొందాలి.
- సమీపంలోని కార్మిక శాఖ కార్యాలయాన్ని సంప్రదించి అప్లికేషన్ ఫామ్‌ని పొందవచ్చు. లేదంటే.. కార్మిక శాఖ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి కూడా ఫామ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- అనంతరం దరఖాస్తు ఫామ్‌లో అడిగిన వివరాలన్నీ కరెక్ట్‌గా నమోదు చేయాలి. ఆపై అప్లికేషన్ ఫామ్‌తోపాటు తప్పనిసరిగా అవసరమైన ఇతర పత్రాలను దానికి జత చేయాలి.
- ఆ తర్వాత ఫామ్‌పై సంతకం చేసి కార్మిక శాఖలోని సంబంధిత అధికారికి అందజేయాలి.
- అనంతరం దరఖాస్తు చేసినట్టుగా అధికారి వద్ద నుంచి రిసిప్ట్ తీసుకోవాలి.
- అలాగే రిసిప్ట్‌పై సమర్పించిన తేదీ, సమయంతోపాటు మరికొన్ని ముఖ్యమైన వివరాలు సరిగ్గా ఉన్నాయా.. లేదా? అని ఒకసారి చెక్ చేసుకోవాలి.
- ఇక మీ దరఖాస్తు తర్వాత.. సంబంధిత ప్రభుత్వ అధికారి దానిపై విచారణ చేపడతారు.
- అప్పుడు కార్మికుడు సహజ మరణం పొందినట్టు నిర్ధరణ జరిగితే.. నేరుగా దరఖాస్తుదారుడి బ్యాంక్ అకౌంట్లోకి ఆర్థిక సాయం జమ అవుతుంది.
ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.6 లక్షల సాయం - ఈ స్కీమ్ గురించి తెలుసా?