National Handloom Award Winner Karnati Mukesh : నేతపనికి కళాత్మక నైపుణ్యం, ఓపిక ఎంతో అవసరం. సృజనాత్మకత, మేధాశక్తి కలగలసిన ఈ వృత్తి అంటే ఇతడికి చెప్పలేనంత ఇష్టం. తల్లిదండ్రులు రంగు రంగుల చీరలు అలవోకగా సృష్టిస్తుంటే చిన్నప్పుడు ఆశ్చర్యంతో గమనించేవాడు. తర్వాత ఒకపక్క చదువుకుంటూనే వారసత్వంగా వచ్చిన వృత్తిని అందిపుచ్చుకుని కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలబడ్డాడు. కష్టపడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించినా మసకబారిన చేనేత వృత్తికి పూర్వవైభవం తీసుకురావాలని తపించాడు. పర్యావరణహిత వర్ణాలతో డబుల్ ఇక్కత్ నూలు చీరను సృష్టించి ఏకంగా జాతీయ పురస్కారాన్ని కొల్లగొట్టాడు.
అవకాశాలను సృష్టించుకుని చేనేత రంగంలో రాణిస్తున్న ఈ యువకుడి పేరు కర్నాటి ముఖేశ్. యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొయ్యలగూడెం గ్రామానికి చెందిన కర్నాటి నారాయణ, పారిజాత దంపతుల కుమారుడు. పాఠశాల స్థాయి నుంచే చేనేత పని నేర్చుకున్నాడు. బీటెక్ పూర్తయ్యాక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చినా తండ్రి, తాతల నుంచి వారసత్వంగా వచ్చిన నేతపనినే ఉపాధి మార్గంగా ఎంచుకున్నాడు. ఎక్కడికో వెళ్లి ఎవరి దగ్గరో ఉద్యోగం చేయడం కంటే కాలానుగుణంగా కొత్త డిజైన్లు తీసుకొస్తే ఈ వృత్తిలోనే మంచి ఆదాయం పొందవచ్చని ఊహించాడు.
వినూత్న డిజైన్లతో చీరలు : డీలా పడిన నేత కార్మికుల్లో కొత్త ఉత్సాహం నింపడమే లక్ష్యంగా తండ్రితో కలిసి వినూత్న డిజైన్లతో చీరలు నేయడం ముఖేశ్ మొదలుపెట్టాడు. రాధాకృష్ణ హ్యాండ్ లూమ్స్ పేరిట చిన్న దుకాణం తెరిచి చీరల అమ్మకాలు మొదలుపెట్టాడు. ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కేలా సహజసిద్ధమైన రంగులకు ప్రాధాన్యత ఇచ్చాడు. కరక్కాయ పొడి, కుంకుడు కాయ, సీకాయ రసంతో నూలు పోగును శుభ్రంగా కడిగి సహజ రంగులు వచ్చేలా చేసేవాడు.
తన ప్రయత్నాలకు ఆదరణ లభించడం చూసి ఇదే రీతిలో ప్రయత్నిస్తే చేనేత రంగంలో నెగ్గుకురావడం సులభమవుతుందని ముఖేశ్ భావించాడు. రెండేళ్లు శ్రమించి వంద డిజైన్లతో సహజసిద్ధ రంగులతో డబుల్ ఇక్కత్ చీరను నేశాడు. ప్రకృతిలో కనిపించే పూలు, పండ్లు, ఆటబొమ్మలు, చదరంగం గళ్లు, స్వస్తిక్ వంటి చిత్రాల ప్రేరణతో 5 నెలలు శ్రమించి గ్రాఫ్ డిజైన్లు తయారు చేశాడు. చీర నేసే సమయంలో ఎదురైన ఇబ్బందులు, తయారీ విధానాన్ని వివరిస్తున్నాడు.
ఆయుర్వేద గుణాలున్న రసాలతో చేనేత చీరలు : ఆయుర్వేద గుణాలున్న కుంకుడుకాయ, కరక్కాయ రసంతో చీర తయారీకి ఉపయోగించిన నూలు దారాన్ని శుద్ధి చేశానని ముఖేశ్ చెబుతున్నారు. ఇండిగో చెట్టు నుంచి నీలం, బంతిపూలు, దానిమ్మ పొట్టును మరిగించి పసుపు, బెల్లం, ఇనుము తుక్కు నుంచి నలుపు, చెట్ల వేర్ల నుంచి ఎరుపు వర్ణాలను తయారు చేసి నూలుపోగులకు అద్దారు. రెండేళ్లు శ్రమించి 600 గ్రాముల బరువుండే డబుల్ ఇక్కత్ చీరను నేశారు. ఇప్పటి వరకు ఈ తరహా చీరలను 50 పైగా తయారు చేశానని ముఖేశ్ అంటున్నారు.
14 మంది ఎంపిక అవ్వగా ముఖేశ్‌కు మొదటిస్థానం : 2023 జాతీయ చేనేత పురస్కారానికి కేంద్ర చేనేత, జౌళి శాఖ 14 మందిని ఎంపిక చేయగా వారిలో తెలంగాణ నుంచి ముఖేశ్ అవార్డు సాధించారు. తెలంగాణ నుంచి 27 మంది దరఖాస్తు చేసుకోగా ముఖేశ్ ఒక్కడే ఎంపికయ్యారు. దీంతో తాను పడ్డ శ్రమకు ఫలితమే ఈ పురస్కారమని ఆయనం ఆనందం వ్యక్తం చేశారు.
గతంలోనూ 25 డిజైన్లతో ఇక్కత్ చీరను నేసి 2022లో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కారాన్ని కర్నాటి ముఖేశ్ అందుకున్నారు. అలాగే ఇప్పుడు జాతీయ స్థాయి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రపంచం మెచ్చేలా మహాత్మాగాంధీకి ఇష్టమైన ఖాదీ దారంతో మరో అద్భుతమైన చేనేత చీరను తయారు చేయడమే తన లక్ష్యమని ముఖేశ్ చెబుతున్నారు.
కర్నాటి ముఖేశ్, జాతీయ పురస్కార గ్రహీత
జాతీయస్థాయిలో మెరిసిన తెలంగాణ చేనేత కళ - ఆ చీరకు నేషనల్ అవార్డు - AWARD FOR ECO FREINDLY SAREE