Nara Chandrababu and Lokesh react on constable death: అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల దాడి ఘటనలో మృతి ఘటనపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. వైఎస్సార్సీపీ పాలనలో పోలీసులకు భద్రత లేదని ఆరోపించారు. అడ్డొచ్చిన పోలీసుల్ని వైఎస్సార్సీపీ రెడ్ శాండిల్ మాఫియా చంపేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్సీపీ పాలనలో పోలీసులకు భద్రత లేదు: అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో కానిస్టేబుల్ చనిపోవడం బాధాకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. స్మగ్లర్లకు టికెట్లిచ్చే వైఎస్సార్సీపీ పాలనలో పోలీసులకు భద్రత లేదని ఆరోపించారు. స్మగ్లర్లు, గూండాలకు సీఎం జగన్ ప్రాధాన్యమిస్తుంటే వారు పోలీసులను లెక్కచేస్తారా? అంటూ ప్రశ్నించారు టాస్క్‌ఫోర్స్‌ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేసింది. ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ గణేశ్ కుటుంబాన్ని ఆదుకోవాలి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
పార్టీ అభ్యర్థులుగా ఎర్రచందనం స్మగ్లర్లు: పుంగనూరు వీరప్పన్ పెద్ది రెడ్డి, అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ప్లానింగ్‌తో వైఎస్సార్సీపీ పార్టీ రెడ్ శాండిల్ మాఫియా అవతారం ఎత్తిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. జగన్ పాలన ఎర్రచందనం స్మగ్లర్ల పాలిట స్వర్ణయుగం అయ్యిందని మండిపడ్డారు. ఎర్రచందనం స్మగ్లర్లను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన జగన్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశాడని దుయ్యబట్టారు. అడ్డొచ్చిన పోలీసుల్ని వైఎస్సార్సీపీ రెడ్ శాండిల్ మాఫియా చంపేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ గణేష్ ని చంపేయటం రాష్ట్రంలో వైఎస్సార్సీపీ రెడ్‌శాండిల్ మాఫియా దారుణాలకు పరాకాష్ట అని లోకేశ్ విమర్శించారు. టాస్క్ ఫోర్స్ పోలీసు వాహనాలనే ఢీకొట్టి కానిస్టేబుల్‌ని చంపేశారంటే, సర్కారు పెద్దల అండదండలతో ఎంతగా బరితెగించారో అర్థం చేసుకోవచ్చని ఆక్షేపించారు. విధినిర్వహణలో పాలకుల మాఫియాకి బలైన కానిస్టేబుల్ గణేష్ కి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గణేష్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలన్నారు.
ఇదీ జరిగింది: అన్నమయ్య జిల్లాలో కేవీపల్లి మండలం చీనెపల్లె వద్ద ఎర్రచందనం అక్రమ రవాణా అవుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి సమాచారం అందింది. దీంతో సుండుపల్లి సరిహద్దు గొల్లపల్లి చెరువు వద్ద స్మగ్లర్లు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కాపు కాశారు. ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని కానిస్టేబుల్ గణేశ్ ఆపేందుకు ప్రయత్నం చేశారు. కానిస్టేబుల్ గణేశ్ నుంచి తప్పించుకునే క్రమంలో అతడిని వాహనంతో ఢీకొట్టారు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను పీలేరు ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మృతి చెందారు. పోలీసులు గాలింపు చేపట్టి ఎర్రచందనం వాహనంతో సహా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనంలో ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది గుర్తించారు.