Nalgonda Man Create Guinness Book Record : తల్లి అన్న ఆ చిన్న మాటనే జీవిత మంత్రంగా భావించి ఏకంగా నాలుగు గిన్నీస్ బుక్ రికార్డులను సొంతం చేసుకున్నాడు ఆ కుర్రాడు. ఇంట్లో చూస్తే పేదరికం. కానీ దానికి లొంగకుండా జీవిత ఆశయం కోసం శ్రమించాడు. చివరికి విజేతగా నిలిచి తల్లి మాటనే నిజం చేశాడు. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఓ పక్క చదువుకుంటూ, సాహసమే తన ఊపిరిగా బతికాడు. చివరికి ఆ సాహసమే తనను ప్రపంచానికి పరిచయం చేసే విధంగా చేసుకున్నాడు. ఆ యువకుడే నల్గొండకు చెందిన కనికెర క్రాంతి.
తన చిన్నప్పుడు వాళ్ల అమ్మ 'ఒరేయ్ ఈ చిన్న చిన్న మాయలు, గారఢీలు ఈ పల్లెటూల్లో చేయడం కాదు. ప్రపంచం నిన్ను గుర్తించేలా చేయ్. నా కొడుకువనిపించుకో' అని సరదాగా అన్న మాటలనే క్రాంతి సీరియస్గా తీసుకొని, ఆలోచనలో పడ్డాడు. సాహస విన్యాసాలు సాధన చేయడం ఆరంభించాడు. చివరికి అమ్మ ఆశయం నిజం చేస్తూ ప్రపంచ గుర్తింపు పొందాడు.
అమ్మ మాటలే పట్టుదలను పెంచాయి : 'అమ్మ పనికెర మల్లమ్మ, నాన్న సత్తయ్య. కూలీ పనులు చేసుకుంటూ నన్ను, అన్న సూర్యను పెంచారు. అన్న తాపీ మేస్త్రీ పని చేస్తూ అమ్మనాన్నలకు చేదోడువాదోడుగా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి నాకు మేజిక్ చేయడం అంటే ఇష్టం. గ్రామంలోనే ఉంటూ మేజిక్ నేర్చుకుంటూ చిన్న, చిన్న గారఢీలు ప్రదర్శించేవాడిని. తమకు కొద్దిగా వ్యవసాయం ఉంది. వ్యవసాయం చేసినప్పుడు నాన్నకు సాయం చేసేవాడిని. ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఆ రోజు నా జీవితాన్నే మార్చేసింది. సరదాగా వీధిలో ఓ ఇంద్రజాల ప్రదర్శన చేస్తూ ఉంటే అమ్మ చూసింది. ప్రపంచం గుర్తించేలా చేయ్. నా కొడుకువనిపించుకో అన్నది. అప్పుడు ఆ మాటలు నాలో పట్టుదలను పెంచాయి. ఆ మాటలతో ఏఏ విన్యాసాలు చేస్తే ప్రపంచ గుర్తింపు పొందవచ్చో మూడేళ్లు కృషి చేశాను. పదేళ్లు సాధన చేశాను.' అని క్రాంతి చెప్పాడు.
ఇప్పటికీ ఇంద్రజాలంలో 300కు పైగా జాతీయ, అంతర్జాతీయ టీవీ ఛానెళ్లలో ప్రదర్శనలు ఇచ్చానని క్రాంతి తెలిపాడు. అవి చూసిన గిన్నీస్ బుక్ రికార్డు వాళ్లే తనకు ఆహ్వానం పంపారని చెప్పాడు. అందరూ దరఖాస్తు చేసుకుంటే అవకాశం కల్పిస్తారు. కానీ తనను మాత్రం ఆహ్వానించారని వివరించాడు. ఒకేసారి పది గిన్నీస్ బుక్ రికార్డుల కోసం ప్రయత్నించానని, నాలుగు గిన్నీస్ బుక్ రికార్డులను కైవసం చేసుకున్నట్లు చెప్పాడు. మరో మూడింటి కోసం సాధన చేస్తున్నానని, అతి త్వరలోనే మరికొన్ని రికార్డులను అందుకుంటానన్న నమ్మకం తనకు ఉందని క్రాంతి స్పష్టం చేశాడు.
కనికెర క్రాంతి సాధించిన రికార్డులు :
- గొంతులో రెండు ఫీట్ల పొడవైన 37 కత్తులు దింపుకుని 16 సెకన్లలో 1,944 కిలోల బరువు(కారు, దానిపై ఎనిమిది మంది)ని లాగారు.
- 60 సెకన్లలో మరుగుతున్న నూనె నుంచి 17 చికెన్ ముక్కలను బయటకు తీశాడు.
- ముక్కు లోపలికి నాలుగు ఇంచుల పొడవాటి ఇనుప మేకులను సుత్తితో కొట్టి లోపలికి దించడం. 60 సెకన్లలో 22 మేకులను ముక్కులో దించుకుని రక్తపు చుక్క రాకుండా చేసి కొత్త రికార్డును నమోదు చేశాడు.
- 60 సెకన్లలో 72 టేబుల్ ఫ్యాన్లతో నాలుకతో ఆపగా అందులో 57 ఫ్యాన్లు ఆగినట్లు గిన్నీస్ బుక్లో రికార్డు నమోదు అయింది.