Ganja Burnt in Nalgonda District : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడ డ్రగ్స్ వాసన వచ్చినా, నిందితులను పట్టుకుని కటకటాల్లోకి పంపుతున్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు సైతం నడుం బిగించారు. ఇందులో భాగంగానే ఇటీవల తరచూ మత్తు పదార్థాల సరఫరాదారులను అరెస్టు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటున్నారు. ఆపై కోర్టు ఆదేశాల మేరకు వాటిని ధ్వంసం చేస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లాలో ఇటీవల కాలంలో దొరిగిన 2000 కిలోల గంజాయిని ఎస్పీ చందనా దీప్తి ఆధ్వర్యంలో తగులబెట్టారు.
కోర్టు ఉత్తర్వుల ప్రకారం జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ అధ్వర్యంలో రూ.5.10 కోట్ల విలువ చేసే మొత్తం 2,043 కిలోల గంజాయిని కాల్చి బూడిద చేశారు. స్థానికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నెపర్తి పోలీస్ ఫైరింగ్ రేంజ్ వద్ద గంజాయిని కాల్చేశారు. 39 కేసుల్లో సీజ్ చేసిన మెుత్తం 2043 కిలోల గంజాయిని నేడు తగులబెట్టినట్లు ఎస్పీ చందనా దీప్తి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గంజాయి అక్రమ రవాణాపై నిరంతర నిఘా ఉంటుందని, మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పని చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఎవరైనా గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
డ్రగ్స్ అమ్మితే అరెస్టే కాదు, ఆస్తులు కూడా సీజ్ - Freezing Of Property Under NDPS ACT
'నల్గొండ జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో నేడు రూ.5.10 కోట్ల విలువైన గంజాయిని తగులబెట్టాము. మొత్తం 15 పోలీస్ స్టేషన్ల పరిధిలోని 39 కేసుల్లో పట్టుకున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాలను కోర్టు ఆదేశాల మేరకు కాల్చి వేశాం. ప్రజలకు ఇబ్బంది కలగకుండా జనావాసాలకు దూరంగా అన్నెపర్తి పోలీస్ ఫైరింగ్ రేంజ్ వద్ద గంజాయిని పూర్తిగా కాల్చి బూడిద చేశాం. గత నెలలోనూ సుమారు 1400 కిలోల గంజాయిని కాల్చేశాము. మరికొన్ని కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. తీర్పు వెలువడిన తర్వాత వాటినీ తగులబెడతాం. ఎవరైనా గంజాయి రవాణా చేస్తున్నట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.' అని ఎస్పీ చందనా దీప్తి వివరించారు.