Nagarjuna Sagar Dam Gates Opened : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు జలాశయాలకు వరద ప్రవాహం ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలు ప్రాజెక్టుల గేట్లను అధికారులు తెరిచారు. నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. శ్రీశైలం నుంచి ఏకంగా 4 లక్షల 91 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో నాగార్జునసాగర్ జలాశయం 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం 26 క్రస్ట్ గేట్లలో 14 గేట్లను 10 అడుగుల మేర, 12 గేట్లను పది హేను అడుగుల మేరకు ఎత్తి స్పిల్వే ద్వారా 4 లక్షల 65 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయిలో నిండటంతో ఎగువ నుంచి వచ్చే వరదను, అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్ కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల కొనసాగుతోంది. నాగార్జునసాగర్ ప్రస్తుత, పూర్తి నీటిమట్టం 590 అడుగులు ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గానూ, ప్రస్తుత నీటినిల్వ 308.7614 టీఎంసీలుగా ఉంది. వరద ప్రవాహం ఆధారంగా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చర్యలు చేపడతున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి ఇంత మొత్తం వరద ప్రవాహం రావడం 2019 తరువాత ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. మరోవైపు కృష్ణ దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
కడెం జలాశయం 10 గేట్ల ద్వారా నీటి విడుదల : కడెం జలాశయం ఎగువ ప్రాంతంలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జలాశయానికి భారీగా వరదనీరు వస్తుండడంతో నీటిని దివగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి 65130 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో 10 గేట్ల ద్వారా 79000 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 695 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చచరికలు జారీ చేశారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేత : పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 62 గేట్ల గాను 16 గేట్లు ఎత్తి 1 లక్ష 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువన కురిసిన వర్షాలతో వాగులు వంకలతో పాటు కడెం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి ఎల్లంపల్లి ప్రాజెక్టులో చేరుతుండడంతో నిండుకుండలా తలపిస్తోంది. ఇదే తరహాలో వరద ప్రవాహం కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నిల్వ 18.6750 టీఎంసీలు. ఇన్ ఫ్లో 77545 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 71572 క్యూసెక్కులు వరకు చేరుకుంది.
నిండు కుండలా మారిన స్వర్ణ జలాశయం : నిర్మల్ జిల్లాలో సారంగాపూర్ మండలంలొని స్వర్ణ జలాశయంలోకి ఎగువ నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జలాశయంలోకి 26 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో అధికారులు నాలుగు వరద గేట్ల ద్వారా దిగువకు 30 వేల 80 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా ప్రస్తుతం 1183 చేరి నిండు కుండలా మారింది.