Nagarjuna Sagar Dam Farmers Issue : నాగార్జునసాగర్ జలాశయంలో నీరు పుష్కలంగా ఉన్నా లోలెవల్ వరద కాల్వకి నీటి జాడ లేదు. నల్గొండ జిల్లాలోని చెరుపల్లి, మాడ్గులపల్లి, దాచారం, ఇందుగుల, మర్రిగూడెం, తోపుచర్ల గ్రామాల పరిధిలోని పొలాలకు సాగునీరు అందించేందుకు సాగర్ నుంచి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు లోలెవల్ వరద కాల్వను ఏర్పాటు చేశారు.
కాల్వ నిర్వహణ సరిగా లేక అధికారులు పట్టించుకోకపోవడంతో వరద కాల్వ మెత్తం కంప చెట్లు, ముళ్ల పొదలు, రాళ్లు పేరుకుపోయి నీరు కిందకు రావడం లేదు. చివరి గ్రామాల్లో సాగు నీరందక, భూగర్భజలాలు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. తమకు సాగునీరు ఇవ్వాలని ఇటీవల మాడ్గలపల్లి మండల కేంద్రంలోని అద్దంకి నార్కట్‌పల్లి రహదారిపై రైతులు ధర్నా చేసిన ఇప్పటివరకు అధికారులు స్పందించలేదు.
Farmers Facing Problems In Nalgonda : వరద కాల్వ పొడవునా చెట్లు, ముళ్ల పొదలు ఉండటంతో చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పాటు కాల్వకు అక్రమంగా తూములు ఏర్పాటు చేయడంతో తమకు సాగునీరు అందడం లేదన్నారు. అధికారులు స్పందించి కాల్వలో చెట్లు తొలగించి అక్రమ తూములు వద్ద చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. నాగార్జునసాగర్ వరద కాల్వ ద్వారా చివరి భూములకు సాగునీరు అందించాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రైతులు హెచ్చరిస్తున్నారు. అధికారులు స్పందించి చివరి ఆయకట్టు వరకు వరద కాల్వ ద్వారా సాగునీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
"నాగార్జున సాగర్లో నీరు ఉన్నా చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. వరద కాల్వ పొడవునా అక్రమంగా తూములు ఏర్పాటు చేశారు. అందుకే చివరి భూములు వరకు సాగునీరు రావడంలేదు. చాలా మంది రైతులం నాట్లు వేశాం. బోర్ల ద్వారా నాట్లు వేసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆ బోర్లలో నీళ్లు ఇంకిపోయాయి. దీంతో రైతాంగం వేసుకున్న పంట దెబ్బతింటుంది. అధికారులు స్పందించి వరద కాల్వ ద్వారా సాగునీటిని విడుదల చేయాలి." - బాధిత రైతులు