Muthyalamma Temple Idol Vandalised : సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి చొరబడి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అర్థరాత్రి ఆలయంలోకి చొరబడ్డ ఆగంతకులు విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఆలయ పరిసర ప్రాంతాలలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయం వద్దకు చేరుకున్న స్థానికులు వెంటనే నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఆలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు స్థానికులను నిలువరించే ప్రయత్నం చేశారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒకర్ని అరెస్టు చేశారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆలయం వద్దకు వచ్చి సీపీ ఆనంద్‌తో కలిసి గర్భగుడిని పరిశీలించారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఆలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ కూడా ఘటనా స్థలికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు.
అదేవిధంగా అమ్మవారి విగ్రహం ధ్వంసం ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విగ్రహం ధ్వంసంపై గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని ఆలయం వద్దకు రానిస్తున్నారని, తనను మాత్రం ఎందుకు గృహా నిర్భందం చేశారో అర్థంకావటం లేదన్నారు.
"హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా కావాలనే హిందూ దేవాలయాల మీద ముఖ్యంగా నవరాత్రి పూజల సందర్భంగా చాలా రకాల ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన సంఘటన అందుకు నిదర్శనం. అదేదో దొంగతనానికి వచ్చారని ఒకసారి, మానసికంగా బాగా లేదని మరోకసారి పోలీసులు మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మాత్రం ఎక్కడ కూడా దొంగతనానికి రాలేదు. ఈ అంశంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో హిందూ దేవాలయాలన్నింటినీ రక్షించే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి." -కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి