Kavali Person Murder in Hyderabad : బావమరిది బతుకు బావ కోరతారంటారు. కానీ ఆ అల్లుడు మాత్రం అత్తింటి ఆస్తికోసం కసాయి వాడిలా మారాడు. తన బావమరిదిని అడ్డు తొలగించుకుంటే మొత్తం తనకే దక్కుతుందని ప్లాన్ చేశాడు. దాన్ని అమలు చేశాడు. చివరికి హత్యానేరంలో కీలక నిందితుడిగా మిగిలాడు.. తెలంగాణలోని హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో 15 రోజుల కిందట చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో తాజాగా హత్యకేసు నమోదైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
పందేలలో నష్టపోయి : కావలి పట్టణంలోని ఉత్తర జనతాపేటలో నివసించే మద్దసాని ప్రకాశం బంగారు వ్యాపారం చేసేవారు. అందులో బాగానే సంపాదించారు. తన కుమారుడు, కుమార్తెల భవిష్యత్‌కు బంగారుబాటలు వేయాలని ఆయన కలలుకన్నారు. రెండు సంవత్సరాల కిందట ఓ కుమార్తెను కొండాపురం మండలం సత్యవోలు అగ్రహారానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. అతడు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో పీజీ(పేయింగ్ గెస్ట్) హాస్టళ్లు నిర్వహించేవాడు. అతను ఇటీవల ఎన్నికల్లో తర్వాత క్రికెట్ మ్యాచ్‌ల్లో బెట్టింగ్‌లు పెట్టి రూ.ఐదు కోట్ల వరకు నష్టపోయాడు. దీంతో ఒక్కసారి అంత మొత్తం నష్టపోవడంతో అతడికి అప్పుల వాళ్ల వేధింపులు అధికమయ్యాయి. వారి వేధింపులు భరించలేక అత్తింటి ఆస్తిని కాజేయాలని ప్లాన్ చేశాడు.
Bava who Killed Bavamaridi in Gachibowlil : ఈ క్రమంలోనే హాస్టళ్ల నిర్వహణలో తనకు నమ్మకస్తులు కావాలని అతడు అత్తమామను నమ్మించాడు. దీంతో వారు బీటెక్ చదివి ఖాళీగా ఉన్న తమ కుమారుడు యశ్వంత్‌ను కొన్నేళ్ల కిందట తోడ్పాటుగా ఉండేందుకు పంపించారు. అప్పుడప్పుడూ అత్తమామలకు ఫోన్ చేసి మీ కుమారుడు గంజాయి వ్యసనాల్లో మగ్గుతున్నాడని వారికి చెప్పేవాడు. మీ కుమారుడిని మార్చడం కష్టంగా ఉందని అతని స్నేహితులు కొందరు హైదరాబాద్‌కే వచ్చి చేరారని అత్తమామను నమ్మించాడు.
శరీరంపై గాయాలు చూసి : ఇటీవల వ్యసనాలకు బానిసై మీ కుమారుడు యశ్వంత్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ప్రకాశం దంపతులకు ఫోన్ వచ్చింది. పుట్టెడు దుఃఖంలో ఆ తల్లిదండ్రులు పుత్రుడి మృతదేహాన్ని కావలికి తీసుకొచ్చి దహన సంస్కారాలు చేశారు. ఆ సందర్భంగా వారు యశ్వంత్ మృతదేహంపై పలుచోట్ల గాయాలు ఉన్నట్లు గుర్తించారు. అనుమానంతో తమ కుమారుడి స్నేహితులపై ఆరా తీసేందుకు హైదరాబాద్ వెళ్లారు.
హైదరాబాద్‌లోని హాస్టళ్ల వద్ద ఉండాల్సిన సీసీ కెమెరాల ఫుటేజీ హత్యోదంతం రోజు నుంచి డిలీట్ అయినట్లు ప్రకాశం దంపతులు నిర్ధారించారు. ఈ క్రమంలో ఎదురుగా ఉండే మరో దుకాణంలో ప్రయత్నించారు. ఆ సమయంలో మీ అల్లుడే ఫుటేజీ మొత్తం పరిశీలించాడని, అప్పుడేమైనా పోయి ఉండొచ్చని దుకాణదారుడు చెప్పడంతో వారి అనుమానాలు బలపడ్డాయి. పోలీసులను ఆశ్రయించడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. పోలీసుశాఖ తరఫున ఆ ప్రాంతంలో ఏర్పాటైన హై రెజల్యూషన్ సీసీ కెమెరాలో ఫుటేజీ మొత్తం నిక్షిప్తంగానే ఉంది. ఓ కారులో వచ్చిన సుపారీగ్యాంగ్ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు.
గ్యాంగ్ పట్టుబడిందిలా : పోలీసులు నిందితుడి ద్వారానే ఆ సుపారీ గ్యాంగ్‌కు ఫోన్ చేయించారు. అత్తమామల హత్యలకు సంబంధించి అడ్వాన్స్ తీసుకోవాలని చెప్పించారు. అలా వచ్చిన ఆ గ్యాంగ్ సభ్యులు పట్టుబడ్డారు. తమది కడప ప్రాంతమని పోలీసుల విచారణలో వారు చెప్పినట్లు తెలుస్తోంది. యశ్వంత్‌ను హతమార్చేటప్పుడు 'వద్దు బావ నన్ను చంపొద్దంటూ’ వేడుకున్నాడని ఆ గ్యాంగ్ పోలీసులకు వివరించినట్లు తెలిసింది. దీంతో గచ్చిబౌలి పోలీసులు కావలిలోనూ విచారణ చేపట్టారు. ఘటన గచ్చిబౌలిలో జరిగిందనీ, అవసరమైతే కేసు విచారణకు పూర్తి సహకారం అందిస్తామని కావలి రెండో పట్టణ సీఐ కె.శ్రీనివాస్ పేర్కొన్నారు.
Man Injured in Blade Attack: భార్యాభర్తల మధ్య గొడవలు.. బావపై బావమరిది బ్లేడ్లతో దాడి