Mumbai Family Wear 25 Kg Gold to Tirumala Video Viral : శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల వెళతారు. భక్తులతో తిరుమల కొండలు ఎప్పుడూ ఆధ్యాత్మిక భావనతో అలరాడుతుంటాయి. భక్తులు తాము తెచ్చిన ముడుపులను వెంకటేశ్వరునికి సమర్పిస్తుంటారు. నిత్యం ధనరాశులతో తూగే శ్రీవారిని దర్శించుకోవడానికి ఓ బంగారు ఫ్యామిలీ తిరుమలకు వెళ్లింది. ముంబయికి చెందిన ఆ కుటుంబం సుమారు 25 కేజీల బరువుంటే బంగారు ఆభరణాలను ధరించి స్వామి వారిని దర్శించుకున్నారు.
అనంతరం బయటకు ఆలయ పరిసరాల్లో కలియ తిరిగారు. వారిలో ఇద్దరు 10 కేజీల చొప్పున బంగారాన్ని ధరించగా, మరొకరు 5 కేజీల బంగారాన్ని అలకరించుకున్నారు. ఈ బంగారు ఆభరణాల విలువ సుమారు రూ.15 కోట్లగా ఉంటుందని అంచనా. ఇంత భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు ధరించి శ్రీవారి దర్శనానికి రావడంతో తిరుమల గిరులపై దర్శనానికి వెళ్లిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. వారిని ఆసక్తిగా తిలకించారు. ఇంత బంగారమా అంటూ తీక్షణంగా చూశారు. ఆలయం ఎదుట ఉన్న భక్తులు వారిని చూసి సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించారు.
వారు అడిగిన వారందరికీ సెల్ఫీలు ఇస్తూ చిరునవ్వులు చిందించారు. వారి బంగారు ఆభరణాలు ఎవరైనా పట్టుకొని వెళ్లిపోతారన్న భయం వారిలో కనిపించలేదు. ఎందుకంటే వారి రక్షణ కోసమే సుమారు 15 మంది సెక్యూరిటీ సిబ్బంది రావడం మరో విశేషం. ఇలా భక్తులు ఇంత బంగారం ధరించి శ్రీవారిని దర్శించుకోవడం ఇదే ప్రథమం కావచ్చు.
గతంలో కూడా ఓ ఫ్యామిలీ బంగారు ఆభరణాలతో దర్శనం: ఇప్పుడే కాదు గత ఏడాది కూడా ఇలానే మహారాష్ట్రకు చెందిన గోల్డ్‌మెన్ కుటుంబం బంగారు ఆభరణాలతో సందడి చేసింది. వీరు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమలతో ఉన్న బంగారు ఆభరణాలను ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇలా ఎప్పుడూ చేస్తామని చెబుతున్నారు. తమ పూర్వీకులు తయారు చేసిన ఈ ఆభరణాలు వేసుకొని శ్రీవారిని దర్శించుకుని మళ్లీ తిరిగి మహారాష్ట్ర వెళ్లిపోతామన్నారు. ఇప్పుడు ఇదో ఫ్యాషన్‌గా మారిపోయింది. అలాగే తెలంగాణ, కర్ణాటక, ఏపీకి చెందిన పలువురు భక్తులు ఇలానే ఒంటి నిండా బంగారు ఆభరణాలతో దర్శనం చేసుకుంటున్నారు. వీరిని చూసిన సామాన్య జనం అవాక్కై చూస్తున్నారు.