Mumbai Actress Case Updates: ముంబయి నటి కేసులో వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు వచ్చేనెల 4 వరకు రిమాండ్ విధించారు. నటి కాదంబరీ జెత్వానీ కేసులో దర్యాప్తులో వెలుగుచూసిన ఆధారాలు, వ్యక్తుల ప్రమేయాన్ని బట్టి నిందితులుగా చేరుస్తామని విజయవాడ నగర పోలీసు కమిషనర్ రాజశేఖర్‌బాబు అన్నారు. నిందితుడు కుక్కల విద్యాసాగర్‌ను దేహ్రాదూన్‌లో అరెస్టు చేసి, ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడ తీసుకొచ్చారు.
ఇంటరాగేషన్‌లో వచ్చిన వివరాలను పరిగణలోకి తీసుకుని నిందితులుగా ఎవరిని చేర్చాలో నిర్ణయిస్తామని రాజశేఖర్‌బాబు వివరించారు. నిందితుల విషయమై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. విద్యాసాగర్‌ను నేడు న్యాయస్థానంలో హాజరుపరుస్తామన్నారు. తమ పరిధిలో ఉన్నంత వరకు రక్షణ కల్పిస్తామని, ఆమెకు ఉన్న ముప్పు ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ప్రమేయం ఎంతవరకు ఉందో పూర్తి స్థాయి ఆధారాలు సేకరిస్తున్నారు. నేర తీవ్రత ఆధారంగా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా విద్యాసాగర్‌ను దేహ్రాదూన్ నుంచి రైలులో అర్ధరాత్రి విజయవాడకి తీసుకొచ్చారు. ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ వద్దకు విద్యాసాగర్‌ను తీసుకెళ్లారు.
అయితే తొలుత స్టేషన్ లోపలికి వెళ్లకుండా విజయవాడ వైపు వాహనాన్ని మళ్లించిన పోలీసులు, విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో విద్యాసాగర్‌కు వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షల అనంతరం విద్యాసాగర్‌ను తెల్లవారుజామున జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. వచ్చేనెల 4 వరకు జడ్జి రిమాండ్ విధించారు. విజయవాడ సబ్ జైలుకు నిందితుడు కుక్కల విద్యాసాగర్ తరలించారు.