MPDO Retirement Programme: ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా చిట్వేలి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న ఎన్.శివరామిరెడ్డి ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా సన్మానం, విందు ఏర్పాటు చేయడం సాధారణంగా ఎక్కడైనా జరిగే కార్యక్రమమే. అయితే ఈ నేపథ్యంలో జారీ చేసిన అధికారిక ఉత్తర్వులు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. దీపావళి రోజున ప్రభుత్వ సిబ్బందికి బలవంతంగా బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు.
ఎంపీడీవో శివరామిరెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి జరిగే కార్యక్రమానికి అందరూ హాజరు కావాలంటూ కార్యాలయ పరిపాలనాధికారి మోహన్ అధికారిక ముద్రతో ఉత్తర్వులు జారీ చేశారు. విందు భోజనాలు వడ్డించడానికి మండల ఆఫీసు సిబ్బంది, గ్రామ సచివాలయం, నరేగా సిబ్బంది హాజరై భోజన వడ్డింపు పనులు సక్రమంగా చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తీవ్ర విమర్శలు : విస్తరాకులు మొదలు కలర్ రైస్, మటన్, చికెన్, బోటీ, పెరుగు చట్నీ, అన్నం, పప్పు, సాంబారు, రసం వడ్డింపు తదితర బాధ్యతలను ఎవరెవరు నిర్వర్తించాలో నిర్దేశిస్తూ 22 మంది పేర్లు, వారి హోదాతో కూడిన జాబితాను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. క్లీనింగ్ పనుల్ని చిట్వేలి గ్రామ పంచాయతీ సెక్రటరీకి అప్పగించారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు విధులు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ పదవీ విరమణ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా 400 మంది అధికారులను ఆహ్వానించామని, వారందరికీ ఘనంగా విందు ఏర్పాట్లు చేశామని మండల అధికారులు చెబుతున్నారు. ఇందుకయ్యే మొత్తం ఖర్చును సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు భరిస్తున్నారని, ఈ మేరకు విరాళాలు వసూలు చేసినట్లు జంకు లేకుండా అధికారులు చెబుతుండటం గమనార్హం.
ప్రైవేటు వ్యక్తులను నియమించాం : భోజనాల వడ్డింపు కోసం సిబ్బందిని నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై విమర్శలు రావడంతో వారిని తప్పించి ప్రైవేటు వ్యక్తులను నియమించుకున్నామని చిట్వేలి ఎంపీడీవో కార్యాలయ పరిపాలనాధికారి మోహన్ వివరణ ఇచ్చారు. జిల్లా నుంచి ఉన్నాతాధికారులు వస్తున్నందున బాధ్యతగా మాత్రమే సిబ్బందికి ఈ బాధ్యతలు అప్పగించాం అని తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చిన మాట వాస్తవమే అని చెప్పారు.
Retired MPDO Ramakrishna Murder : విశ్రాంత ఎంపీడీవో హత్య.. పాతకక్షలే కారణమా?