Five YouTube Channels Terminated in Telugu : సామాజిక మాధ్యమాల్లో తండ్రి-కుమార్తె వీడియోపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు ఉదంతంపై సినీ ప్రపంచం సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని మా అధ్యక్షుడు మంచు విష్ణు తీవ్రంగా ఖండించి, ఇలాంటి యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో ఐదు యూట్యూబ్ ఛానళ్లపై మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ చర్యలు తీసుకుంది. నటీనటులపై అసభ్యంగా దుష్ప్రచారం చేస్తున్న ఐదు యూట్యూబ్ ఛానళ్లను మూవీ అసోసియేషన్ టెర్మినేట్ చేసింది. ఇది ప్రారంభం మాత్రమే అంటూ యూట్యూబర్లకు 'మా' హెచ్చరికలు పంపుతూ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది.
యూట్యూబ్‌కు 'మా' లేఖ : యూట్యూబ్‌కు లేఖ రాసిన 'మా' ఆ ఐదు ఛానల్ల కంటెంట్ సరిగ్గా లేదని, నటీనటులను ఇబ్బంది పెట్టే విధంగా ఉందంటూ రద్దు చేయాలని లేఖ రాసింది. మా రాసిన లేఖపై స్పందించిన యూట్యూబ్ యంత్రాంగం పరిశీలించి వాటిని రద్దు చేస్తున్నట్లు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌కు తెలిపింది.
'మా' రద్దు చేసిన యూట్యూబ్ ఛానళ్లు :
- జస్ట్ వాచ్ బీబీసీ
- ట్రోల్స్ రాజా
- బచిన లలిత్
- హైదరాబాద్ కుర్రాడు
- ఎక్స్వైజెడ్ఎడిట్జెడ్007
మా అధ్యక్షుడు మంచు విష్ణు ఫైర్ : నటీనటులపై అసభ్యకర, అశ్లీల వీడియోలు చేస్తున్న యూట్యూబర్లకు మా అధ్యక్షుడు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చి రెండు రోజులు కాకముందే మూవీ అసోసియేషన్ చర్యలు తీసుకుంది. యూట్యూబర్లు నటీనటులు, వారి కుటుంబీకులపై పెట్టిన వీడియోలు, పోస్టులు 48 గంటల్లో తొలగించాలని మంచు విష్ణు హెచ్చరించారు. అలా తొలగించని పక్షంలో ఆ యూట్యాబర్లపై క్రిమినల్ కేసులు పెట్టి ఛానల్స్‌ను మూసివేస్తామని హెచ్చరికలు పంపారు.
వారం రోజుల క్రితం ఓ యూట్యూబర్ తండ్రి-కుమార్తె వీడియోపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ వీడియోపై తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలుపుతూ మా అధ్యక్షుడు మంచు విష్ణు ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. మహిళలను కించపరిచేలా వ్యవహరించిన ఆ యూట్యూబర్‌పై చర్యలు తీసుకున్నందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలను ఆయన తెలిపారు. ఈ ఘటనపై మా అసోసియేషన్‌కు చాలా మంది నటీనటులు లేఖలు, మెయిల్స్ రాస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో యూట్యూబ్‌లో తమ వీడియోలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఈ క్రమంలో నటీనటులు, వారి కుటుంబ సభ్యులను కించపరుస్తూ వీడియోలు తీస్తున్న యూట్యూబర్లకు హెచ్చరికలు పంపారు. ఇప్పుడు ఐదు యూట్యూబ్ ఛానళ్లను బంద్ చేస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. యూట్యూబర్ ఘటనపై ముందుగా సాయిదుర్గ తేజ్ ఆ వీడియోను తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఎక్స్ వేదికగా ట్యాగ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి నిందితులను అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. బెంగళూరులో నిందితుడు ప్రణీత్ హనుమంతును పట్టుకున్న పోలీసులు అతడిని హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం మరో ముగ్గురుని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. అనంతరం నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.